ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో వరుసగా జరుగుతున్న దోపిడీలు,,,శాంతి భద్రతలపై కేజ్రీవాల్ ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 10:25 PM

వరుస దోపిడీ ఘటనలు దేశ రాజధాని ఢిల్లీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 4 రోజుల్లోనే 3 దోపిడీ ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత శనివారం ( జూన్ 23 ) రోజున ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్‌లో జరిగిన ఘటన, ఆ తర్వాతి రోజు మరో ఘటన జరిగింది తాజాగా మంగళవారం మరో దోపిడీ ఘటన జరగడంతో.. వరుస ఘటనలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ప్రాంతంలో ఓ వ్యాపారి వద్ద నుంచి మంగళవారం రూ. 3 లక్షలు, ద్విచక్రవాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యాపారిని పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించారు. అనంతరం అతని వద్ద ఉన్న రూ. 3 లక్షలు, బైక్‌ను తీసుకెళ్లి పోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. గత నాలుగు రోజుల్లో ఢిల్లీలో జరిగిన మూడో సంఘటన కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.


శనివారం రోజున ఢిల్లీలోని ప్రకతి మైదాన్ టన్నెల్‌లో రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు కారులో వెళ్తున్న ఇద్దర్ని అడ్డగించారు. 2 బైక్‌ల పైనుంచి ఇద్దరు తుపాకీలతో దిగి రూ. 2 లక్షలు దోచుకెళ్లిపోయారు. నడి రోడ్డుపై కేవలం 15 సెకన్లలో వచ్చిన పని పూర్తి చేసి పరారయ్యారు. ఈ ఘటన కూడా స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో రికార్డు అయింది. ఆ తర్వాత సోమవారం రోజు రాత్రి మరో ఘటన చోటు చేసుకుంది. హర్ష్ విహార్ ప్రాంతంలో దుకాణం నిర్వహించే ఓ 70 ఏళ్ల వ్యాపారి.. సోమవారం రాత్రి పని ముగించుకుని దుకాణం మూసివేస్తుండగా.. దుండగులు చొరబడ్డారు. అతని చేతిలో రూ.1 లక్ష నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా.. వృద్ధుడు అడ్డుకున్నాడు. దీంతో తుపాకీతో బెదిరించి బ్యాగు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో నమోదు అయ్యాయి.


దేశ రాజధానిలో జరుగుతున్న వరుస దోపిడీలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలను కాపాడటంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ఒక వేళ ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్రం నిర్వహించలేకపోతే.. ఆ బాధ్యతలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రజలను ఎలా సురక్షితంగా ఉంచాలో తాము చేసి చూపిస్తామని ట్వీట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa