హైదరాబాద్ నుంచి దర్జాగా వస్తాడు.. చోరీకి చేసుకుని వెళ్లిపోతాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 ఏళ్లగా ఇదే తంతు.. జైలుకు వెళ్లొచ్చినా పద్దతి మారలేదు.. మళ్లీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బి.కల్పన రైల్వే శాఖలో పనిచేస్తున్నారు.. రాజమహేంద్రవరం రైల్వేక్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. జూన్ 4న బెంగళూరులో కుమార్తె ఇంటికెళ్లి 21న మళ్లీ తిరిగొచ్చారు.. ఇంట్లో ఉంచిన 20 గ్రాముల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. తన ఇంట్లో చోరీ జరిగిందని ఆమె పోలీసులకుపై ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎ.ఎస్.రావ్ నగర్ ప్రాంతానికి చెందిన చెల్లె జాషూవా అమిత్ కుమార్‌ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ స్టేషన్ పరిధిలో తొమ్మిది, కడియంలో రెండు, గోపాలపురంలో ఒక చోరీలు చేసినట్లు గుర్తించారు. పట్టణ స్టేషన్ పరిధిలోని రైల్వే క్వార్టర్స్‌లోని ఓ ఇంట్లో బంగారం, చోరీ చేశాడు. ఆ బంగారాన్ని సీజ్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు.
అమిత్ కుమార్ గత కొన్నేళ్లుగా ఇలా దొంగతనాలు చేస్తున్నాడు. పలుమార్లు జైలుశిక్ష అనుభవించినా తీరు మాత్రం మార్చుకోలేదు. హైదరాబాద్ నుంచి రైలులో వచ్చి ఏదొక స్టేషనులో దిగి ఆ చుట్టు పక్కల ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తాడు. తాను అనుకున్న ఇంట్లో దొంగతనం చేసి హైదరాబాద్ వెళ్లిపోతాడు. అతడి దగ్గర నుంచి బంగారం, వెండి ఆభరణాలు, ఇబ్రహీంపట్నంలో చోరీచేసిన ఒక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ రికవరీ చేశారు. నిందితుడిపై తెలంగాణ, మహారాష్ట్రలో కూడా కేసులు నమోదై ఉన్నాయి. అమిత్ కుమార్ రెండు, మూడు నెలలకోసారి హైదరాబాద్ నుంచి రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వెళ్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేసి వెళ్లిపోతాడు. పదకొండేళ్లుగా ఈ చోరీ చేస్తున్నట్లు చెబుతున్నారు.