పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు అనేక కుట్రలు చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఒక సిల్లీ బచ్చా తన పాదయాత్రకు జనాలే రావడంలేదని అంటున్నాడని తెలిపారు. కానీ, కార్యకర్తలే అండగా యువగళం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని లోకేశ్ ఉద్ఘాటించారు. తన పాదయాత్ర చూసి జగన్ కు మతిపోయిందన్నారు.
ఇదిలావుంటే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో లోకేశ్ ప్రసంగం వాడీవేడిగా సాగింది. తన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై 20 కేసులు పెట్టారని, వాటిలో హత్యాయత్నం కేసు కూడా ఉందని లోకేశ్ వెల్లడించారు. ఆఖరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని, అయినా తానేమీ భయపడలేదని అన్నారు. తనపై మోపిన కేసుల్లో కనీసం ఒక్కదాంట్లోనైనా ఆరోపణలు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. జగన్ తన మంత్రులను కూడా తనపైకి ఉసిగొల్పారని లోకేశ్ వ్యాఖ్యానించారు.
కార్యకర్తలే తన బలం అని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులకు తగ్గుతానా? వెనుకడుగు వేస్తానా? మనం భయపడతామా? అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిరంచారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నట్టు నారా లోకేశ్ సభాముఖంగా వెల్లడించారు. 2019 నుంచి 2024 వరకు ఎవరిపై అయితే ఎక్కువ కేసులు నమోదవుతాయో, వారికి అంతపెద్ద నామినేటెడ్ పదవి ఖాయం అని ప్రకటించారు. ఆ నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యతను తానే స్వీకరిస్తానని స్పష్టం చేశారు.
"కార్యకర్తలు కేసులకు భయపడొద్దు. మొన్న ఒక కార్యకర్త వచ్చి, అన్నా నా మీద 3 కేసులు ఉన్నాయన్నాడు. నువ్వేం మాట్లాడొద్దు... వెళ్లి పోరాడు... ఇంకో 17 కేసులు నమోదైన తర్వాత నా దగ్గరికి రా అని చెప్పాను. జేసీ ప్రభాకర్ రెడ్డి వయసెంత... ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా... 67 కేసులు ఉన్నాయి. తాడిపత్రిలో ఉన్న ఒక్కొక్క మున్సిపల్ కౌన్సిలర్ పై రెండు డజన్ల కేసులున్నాయి.
ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నన్ను కలిశారు. లోకేశ్... నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నా అన్నారు. ఎందుకన్నా అని అడిగాను. కొత్తగా నా మీద ఎవరూ కేసులు పెట్టడంలేదు అని జేసీ చెప్పారు. పోరాటానికి వెనుదీయని నైజం అంటే అలా ఉండాలి" అని లోకేశ్ స్పష్టం చేశారు.