తాడేపల్లి ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర వార్డు మహిళా పోలీసు నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకులు వేధిస్తున్నారంటూ మచిలీపట్నంలోని 17వ వార్డు సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేసిన లక్ష్మీప్రసన్న నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి స్టేషన్‌కు తరలించారు. వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు తనపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు.
ఏడాదిగా తనకు జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగితాల్లో ఉద్యోగంలోకి తీసుకున్నట్లు చూపిస్తున్నా విధుల్లోకి తీసుకోవడంలేదన్నారు. తన పక్కింటి వారితో పాటు వైఎస్సార్‌సీపీలో కీలకనేత కుమారుడు తన సమస్య పరిష్కరించకుండా అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తన పిల్లలకు ప్రాణహాని ఉండటంతో స్కూలుకు సైతం పంపలేకపోతున్నామన్నారు. ఇంటికి వచ్చి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
తనను అధికార పార్టీ నాయకులు అకారణంగా విధుల నుంచి సస్పెండ్ చేయించారని.. తిరిగి ఉద్యోగం ఇవ్వకుండా వేధిస్తున్నారని తనకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని కోరారు. తనపై తప్పుడు కేసులు పెట్టడతో పాటు ఉల్లింగి పాలెంలోని తన ఇంటికి అధికార పార్టీ నాయకులు వచ్చి చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. పోలీస్ ఉన్నతాధికారులకు తనగోడును చెప్పుకొన్నా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు.
లక్ష్మీ ప్రసన్నను విధుల నుంచి సస్పెండ్ చేసి.. ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేశారు. తన తప్పు లేకుండానే సస్పెండ్ చేశారని.. తనకు 17వ డివిజన్‌లోనే పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ పోలీస్ ఉన్నతాధికారులను ఆమె కలిశారు. మహిళా పోలీస్ నేరుగా సీఎం ఇంటి దగ్గరే ఆందోళనకు దిగడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.