పోలీసు కాల్పుల్లో నల్లజాతీయ యువకుడు నహేల్ మృతితో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. పెద్దఎత్తున పౌరులు విధ్వంసాలకు పాల్పడుతూ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేస్తూ.. అడ్డుకుంటున్న వారిపై రాళ్లు రువ్వుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలను, డస్ట్ బిన్‌లను తగులబెడుతూ రెచ్చిపోతున్నారు. దీంతో భారీగా బలగాలను మోహరించి, అల్లర్లు అదుపుచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క పారిస్ నగరంలోనే 45 వేల మంది బలగాలను రంగంలోకి దింపారు. తదుపరి కొన్ని గంటలు చాలా కీలకమని, అప్రమత్తంగా ఉండాలని బలగాలకు సూచనలు అందాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 875 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిలో పారిస్ పరిధిలోనే 307 మంది ఉన్నారని ఫ్రాన్స్ హోంమంత్రి గెరాల్ల్ డార్మానిన్ వెల్లడించారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న హింసలో కనీసం 200 మంది పోలీసులు గాయపడ్డారు. నాంటెర్రిలోని 12వ డిస్ట్రిక్ట్ పోలీసు స్టేషన్‌ను ఆందోళనకారుల ముట్టడించారు. రివోలి స్ట్రీట్‌లో పలు దుకాణాలను లూటీ చేశారు. మార్సెయిల్ నగరంలో మూకలను పోలీసులు చెదరగొట్టారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సు, రైలు సర్వీసులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. పలు ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.
ఆందోళనకారుల ఇప్పటి వరకూ 492 నిర్మాణాలను కూల్చివేసి.. 2,000 వాహనాలకు నిప్పంటించారు.పారిస్ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద నహెల్‌ను ఓ పోలీసు అధికారి కాల్చి చంపడం ఆందోళనలకు కారణమయ్యింది. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేయడానికి యువతను ఇంటి దగ్గరే ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విజ్ఞప్తి చేశారు. అలాగే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులకు సూచించారు. స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికలు హింస పెరగడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టే పోస్ట్‌లను తొలగించే విషయమై టెక్నాలజీ సంస్థలతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తుందని మెక్రాన్ వివరించారు. హింసను ప్రేరేపించేందుకు సోషల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించే వారిని గుర్తించేపనిలో ఉన్నామని తెలిపారు. అరెస్టు అయినవారిలో ఎక్కువమంది యువతే ఉన్నారని, వారిలో కొంతమంది మరీ చిన్నవాళ్లని, ఈ నేపథ్యంలో అటువంటివారిని గడప దాటకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ పారిస్ శివారు ప్రాంతమైన నాంటెర్రేలో శుక్రవారం నహేల్ స్మారక మార్చ్ నిర్వహించగా.. అది కాస్త హింసకు దారి తీసింది. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు నాంటెర్రేలోని పలు కార్లకు నిప్పు పెట్టారు.