పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి ఘటనతో ఫ్రాన్స్ అల్లకల్లోంగా మారింది. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన యువత విధ్వంసాలకు తెగబడుతూ ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం నుంచి కొనసాగుతున్న హింసను కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. ఇదిలా ఉండగా.. ఆందోళనలపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్టు ఆందోళనల సమయంలో ఆయన కచేరీలో పాల్గొనడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయన సంగీత కచేరీలో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల పారిస్‌లో జరిగిన బ్రిటిష్ సింగర్ ఎల్టాన్ జాన్ కన్సర్ట్‌కు తన సతీమణితో కలిసి మెక్రాన్ హాజరయ్యారు. ఆ వీడియోలు బయటకు రావడంతో తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ఫ్రాన్స్ నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తుంటే.. మెక్రాన్ సంగీత కచేరీలతో కాలక్షేపం చేస్తున్నారు. అక్కడ ఉత్సాహంగా సతీమణితో కలిసి కాలు కదిపారు’ అని ఓ నెటిజన్ విమర్శలు చేశాడు.
.అయితే, వాస్తవానికి ఆ కచేరీ బుధవారం జరిగింది. అప్పటికి ఘర్షణలు ఉద్ధృతంగా లేవు. కానీ ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బ్రిటిష్ గాయని ఎల్టాన్ జాన్‌తో కలిసి మెక్రాన్ దంపతులు దిగిన ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆమె పోస్ట్ కింద కూడా ఇలాంటి కామెంట్లే దర్శనమిస్తున్నాయి.
‘హింసాత్మక ఘటనల వేళ మెక్రాన్ తన హోం మంత్రికి అండగా ఉండకుండా ఎల్టాన్‌ను అభినందించేందుకే మొగ్గుచూపారు’అని ఒకరు.. ‘తన పాలనలో ఒక టీనేజ్ కుర్రాడు చనిపోతే.. మెక్రాన్ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సమయంలో ఇది సరికాదు’ అని మరొకరు ‘తన ప్రభుత్వంలో పోలీసులు ఓ పిల్లాడ్ని చంపితే మెక్రాన్ కచేరీలను ఆస్వాదిస్తున్నారు.. ఇది చాలా అవమానకరం’ ఇంకొకరు కామెంట్ చేశారు.
మరోవైపు, హింసాత్మక ఘటనలపై శుక్రవారం రాత్రి జాతినుద్దేశించి మెక్రాన్ ప్రసంగించారు. దేశంలో అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు యువతను ఇంటిపట్టునే ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాను నిందించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారాన్ని తొలగించే విషయమై ఆయా సంస్థలతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తుందని మేక్రాన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించాలంటూ అధికారులకు సూచించారు.