తన ఇంటి నుంచి సిటీ, చుట్టూ ఉన్న పర్వతాలు కనిపించకుండా పక్కింటివాళ్ల చెట్లు అడ్డుకుంటున్నాయని.. వాటిని నరికించేశాడు ఓ వ్యక్తి. అతడు చేసిన ఈ పిచ్చి పనికి.. ఇప్పుడు భారీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. తన పొరుగు ఇంటి ఎస్టేట్‌లోని 32కిపైగా చెట్లు నరికేసిన అమెరికా వ్యక్తికి 1.5 మిలియన్ డాలర్లు (రూ.12.3 కోట్లు) కంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉందని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. న్యూజెర్సీకి చెందిన 40 ఏళ్ల సమీహ్ షిన్వే.. తన ఇంటి పరిసరాల్లో ఉన్న ఓక్స్, బిర్చ్, మాపుల్స్ వంటి చెట్లను తన పొరుగింటి వ్యక్తి గ్రాంట్ హబేర్ నరికించినట్టు ఆరోపించారు. ‘ఇది నా హృదయాన్ని కలచివేసింది.. నాకు కోపం తెప్పిస్తుంది.. ఈ చెట్లు పెరగడానికి చాలా సమయం పడుతుంది’ షిన్వే ఆవేదన వ్యక్తం చేశాడు.
యాంటీ టెర్రరిజం కంపెనీ సీఈఓ హేబర్.. కూల్చివేసిన ఒక్కో చెట్టుకు 1,000 డాలర్లు చొప్పున 32,000 డాలర్లు చెల్లించాలి. అలాగే, అమెరికా చట్టాల ప్రకారం.. చట్టవిరుద్ధంగా నరికేసిన చెట్ల స్థానంలో అలాంటి లేదా ఉన్నతమైన జాతికి చెందిన మరొకటి కూడా నాటాల్సి ఉంటుంది. మట్టిని వేయడం, కలుపు మొక్కలు తొలగించడం, శుభ్రపరచడం వంటి ఖర్చులను కూడా చెల్లించాల్సి ఉంటుందని, మొత్తం ఈ పనికి 1.5 మిలియన్ల డాలర్లు ఖర్చవుతుందని షిన్వే తెలిపాడు
పొరుగింటి వ్యక్తుల మధ్య వివాదం ఈ మార్చిలో మొదలైంది. తన ఎస్టేట్‌లోని చెట్లను కూలీల సాయంతో హబేర్ నరికించేశాడాని షిన్వే ఆరోపించాడు. ఎస్టేట్ నుంచి శబ్దాలు రావడంతో అక్కడ వెళ్లేసరికి వృక్షాలను నరుకుతున్నారని, ఇందులో 20 నుంచి 150 ఏళ్ల వయసున్న చెట్లు ఉన్నాయని తెలిపాడు. తన ఇంటి నుంచి సిటీ, పర్వతాలు చూడటానికి చెట్లు అడ్డుగా ఉన్నాయనే ఈ కాంట్రాక్ట్ బాధ్యతను హేబర్ అప్పగించినట్టు అక్కడున్న కాంట్రాక్టర్లు చెప్పారని వివరించాడు. తన ఎస్టేట్‌లోకి చొరబడటమే కాకుండా చెట్లను నరికించేయడంపై షిన్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
‘నేను చెట్లను ఎంతగానో ప్రేమిస్తాను.. అందుకే నా ఆవేదన.. ఎటువంటి కారణం లేకుండా 40 చెట్లను నరికి వాటిని వృధాగా వదిలేయడం.. అది పిచ్చి పని. నేను ప్రతిదీ భర్తీ చేయాలనుకుంటున్నాను’ అని బాధితుడు స్పష్టం చేశాడు. ఇక, చెట్లను నరికించేసిన హేబర్‌తో పాటు ఆ బాధ్యతలు తీసుకున్న కాంట్రాక్టర్లు కూడా 40,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.