ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోనే పారిశ్రామిక వేత్తలు పరారవుతున్నారని బీజేపీ నాయకుడు లంకా దినకర్ అన్నారు. రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలమా. ప్రతికూలమా? అనే అంశంపై శనివారం ప్రొఫెషనల్స్ ఫోరమ్ విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో దినకర్ మాట్లాడారు. జగన్ పాలనలో అరాచకాలకు భయపడి అమర్ రాజా బ్యాటరీస్ మొదలు.. విశాఖపట్నం వైసీపీ ఎంపీ సొంత వ్యాపారాల వరకు అన్నీ తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కియా అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడం, మార్గదర్శిని వేధిస్తుండటం, రాజధాని విధ్వంసం తదితర పైశాచిక చర్యలతో పాటు విద్యుత్ కంపెనీలతో ఒప్పందాలను రద్దు చేయడం వంటి చర్యలు పారిశ్రామిక వేత్తలను ఇటువైపు రాకుండా చేశాయని చెప్పారు. ఉపాధి పరంగా యువత, ఆదాయం పరంగా ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వ పైశాచిక విధానాలతో నష్టపోయాయని మండిపడ్డారు.