ప్రకాశం జిల్లా కొండపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రచ్చకెక్కింది. కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు, మాదాసి వెంకయ్య వర్గం నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. టంగుటూరు జాతీయ రహదారిపై ఓ ‘టీ’ దుకాణంలో మాదాసి వెంకయ్య, మరికొంత మంది టీ తాగుతుండగా.. వరికూటి అశోక్‌బాబు తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు.
ఈ క్రమంలో మాదాసి వెంకయ్య వర్గం అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అశోక్ బాబు వర్గీయులు రెచ్చగొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో మాదాసి వెంకయ్య అనుచరుడు సాయికి తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో మాదాసి వెంకయ్యను ఆయన అనుచరులు వాహనం ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.
ఇదిలావుంటే ఇటీవలే వరికూటి అశోక్ బాబు మిట్టపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించేందుకు ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. అయితే, మాదాసి వెంకయ్య అనుచరులు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ.. ‘మా ఇంటికి రావొద్దు’ అంటూ స్టిక్కర్లు అంటించారు. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం అశోక్ బాబు వర్గీయులు మాదాసి వెంకయ్య అనుచరులపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.