బీజేపీ పార్టీ తీరుపై ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలావుంటే గతంలో శివసేన పార్టీ నిలువునా చీలిపోయి ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎలా నిస్సహాయంగా మిగిలిపోయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితులే శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి ఎదురయ్యాయి. ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్.... షిండే ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. ఆయనతో పాటు ఎన్సీపీని వీడిన వారిలో 9 మంది శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కాయి. ఈ పరిణామాలపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ప్రజలు ఇలాంటి చర్యలను సహించబోరని రౌత్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజకీయాలను శుభ్రం చేసేందుకు కొందరు రంగంలోకి దిగారని, వారిని అదే పనిలో ఉండనిద్దాం అని వ్యాఖ్యానించారు. తాజా ఘటనలపై తాను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మాట్లాడానని రౌత్ వెల్లడించారు. ఇలాంటి పరిణామాలతో తానేమీ కుంగిపోలేదని శరద్ పవార్ చెప్పారని రౌత్ వివరించారు. తాను బలంగానే ఉన్నానని, ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి దృఢమైన రాజకీయ వేదికను పునర్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని శరద్ పవార్ తెలిపారని వెల్లడించారు.