దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందువులకు పరమ పవిత్రమైన చార్ ధామ్ యాత్రకు ఈ ఏడాది అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రతికూల వాతావరణం ప్రధాన సమస్యగా మారింది. బద్రీనాథ్ హైవేపై మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ రహదారి మూతపడింది. గత 3 రోజుల వ్యవధిలో బద్రీనాథ్ రహదారి మూసుకుపోవడం ఇది నాలుగోసారి. మరోవైపు ఖచ్డూ నది ఉప్పొంగుతోంది. దాంతో బద్రీనాథ్ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. జూన్ 29న, జులై 1న బద్రీనాథ్ రహదారిపై ఒకే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడడంతో ఏకంగా 17 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి అదే పరిస్థితి నెలకొనడంతో చార్ ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ వెళుతున్న భక్తులు చాలామంది చింకా ప్రాంతం వద్ద చిక్కుకుపోయారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.