భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్పతనం...అది కర్ణాటక రాష్ట్రంలో మరోసారి రుజువైంది. అనేక మతాలకు నెలవైన భారతదేశంలో మతసామరస్యం అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా, కర్ణాటకలో నిజమైన మతసామరస్యానికి నిదర్శనం వంటి ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలో ఓ హిందూ మతగురువు చేతుల మీదుగా మసీదు ప్రారంభోత్సవం జరుపుకుంది.
కొప్పల్ జిల్లాలోని కుకనూర్ తాలూకా భనపూర్ గ్రామంలో ముస్లింలు నూతనంగా మసీదు నిర్మించుకున్నారు. ఈ మసీదు ప్రారంభోత్సవానికి స్థానిక ముస్లింలు గావి మఠానికి చెందిన అభినవ గావిసిద్ధేశ్వరస్వామిని ఆహ్వానించారు. ఆయన సంతోషంగా అంగీకరించి, మసీదు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మసీదును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సామరస్య పూర్వక వాతావరణంలో జీవించడం ప్రతి ఒక్కరికీ అత్యవసరం అని పేర్కొన్నారు. నిజమైన మతం ఎప్పుడూ సామరస్యాన్నే ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. తమ మతమే గొప్పదని విర్రవీగేవాళ్లు ఎప్పటికీ ఆ మతంపై విశ్వాసం లేనివాళ్లుగానే మిగిలిపోతారని గావిసిద్ధేశ్వరస్వామి అభిప్రాయపడ్డారు. ఓ వ్యక్తి ఎలాంటి వివక్ష లేకుండా రక్తదానం చేస్తాడో ఆ వ్యక్తి మనసా వాచా కర్మణా మతాన్ని అనుసరిస్తున్నట్టు భావించాలని తెలిపారు.
"కేవలం మసీదులు, చర్చిలు, దేవాలయాలకు వెళ్లే వాళ్లే మతవాదులు కారు... ఇతరులను నొప్పించకుండా, మోసం చేయకుండా బతకడమే నిజమైన మతం నేర్పించే జీవన సూత్రం. నిజమైన మతం సామరస్యాన్నే కోరుకుంటుంది. ఈ గ్రామంలో ముస్లిం కుటుంబాలు ఐదు మాత్రమే ఉన్నాయి. అయిన్పటికీ వారు గ్రామస్తులతో కలిసిమెలిసి ఉంటున్నారు. ఇలా ఉండాలనే నిజమైన మతం చెబుతుంది" అని గావిసిద్ధేశ్వరస్వామి వివరించారు.