ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీధి కుక్కల బాగోగులు చూసుకుంటున్న గ్రామస్థులు,,,శునకాల కోసం ఏకంగా ట్రస్ట్ ఏర్పాటు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 02, 2023, 09:53 PM

ఇటీవల వీధి కుక్కలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు తేడా లేకుండా వారిపైకి దాడులకు దిగుతున్నాయి. ఈ ఘటనల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి వీధి కుక్కలను వాళ్లు మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. వీధి కుక్కల ఆలనా పాలనా కోసం ఏకంగా ఓ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. వాటి పేరు మీద విలువైన భూములను కూడా రాసిచ్చారు. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో జరిగింది.


గుజరాత్‌లోని మెహసానా జిల్లా పంచోత్ గ్రామంలో ఉన్న వీధి శునకాల రాజభోగాలు అంతా ఇంతా కాదు. వీధి శునకాలు బాగోగుల కోసం అక్కడ ఏకంగా ఓ ట్రస్ట్‌ను నెలకొల్పారు. కొంతమంది తమ పేరు మీద ఉన్న కోట్ల రూపాయల విలువైన భూమిని శునకాల ఆలనా పాలనా చూసే ట్రస్ట్‌కు విరాళంగా రాసి ఇచ్చేశారు. ఆ భూమిని రైతులకు కౌలుకు ఇచ్చి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుక్కలను పోషిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ట్రస్ట్ పేరు మీద 10 ఎకరాల భూమి ఉంది. దాని విలువ రూ. 90 కోట్లు ఉంటుందని గ్రామస్థులు అంచనా వేస్తున్నారు.


అయితే ఆ గ్రామ ప్రజలు ఇలా వీధి కుక్కలను పోషించడానికి ఒక బలమైన కారణం ఉంది. జంతువులకు సేవ చేస్తే తమకు మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ విశ్వాసంతోనే వీధి శునకాలను బాగా చూసుకునేందుకు ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. పంచోత్ గ్రామంలో ఉన్న కుక్కలకు రోజూ ఆహారాన్ని తయారు చేసి అందిస్తారు. ఈ ఆహారాన్ని అందించడానికి ట్రస్ట్‌ ద్వారా కొంత మంది మహిళలను కూడా నియమించారు. రోజుకు వెయ్యి రొట్టెలను తయారు చేయించి వాలంటీర్ల ద్వారా ఆ వీధి కుక్కలకు అందిస్తున్నారు. ఈ వీధి కుక్కలకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే చికిత్స చేయడానికి ఓ పశు వైద్యుడిని కూడా అందుబాటులో ఉంచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com