శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆషాఢ మాస గిరి ప్రదక్షణ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకోవడం విచారకమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వ వ్యవహరిస్తోందని విశ్వహిందూ పరిషత్ మఠమందర్ రాష్ట్ర టోలి పూడిపెద్ది శర్మ ఆరోపించారు. గిరిప్రదక్షిణ సందర్భంగా సింహాచలంలో స్వామి రథం ప్రారంభ కార్యక్రమంలో విశాఖ నగర పోలీసు కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే రథం ప్రారంభం కార్యక్రమంలో ఆయన షూ ధరించి ఉండడంతో ఇప్పుడు వివాదస్పదమవుతోంది.
ఇది హిందూ బంధువులందరికీ బాధాకరమైన సంఘటన అని టోలి పూడిపెద్ది శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సనాతన ధర్మంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరోక్ష దాడులను, కుట్రలను యావత్ హిందూ ప్రజానికం గమనించాలన్నారు. ఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్ మఠమందర్ రాష్ట్ర టోలి పూడిపెద్ది శర్మ విజ్ఞప్తి చేశారు.