రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. నగరి మండలం కృష్ణా రామాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తినాని, నగరి నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలు, మహిళల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేలా తమ పార్టీ అధినేత చంద్రబాబు మినీ మేనిఫెస్టోను విడుదల చేశారని వివరించారు. ఎంత మంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఒకరికే పరిమితం చేశారని ఆరోపించారు. వివిధ సాకులు చూపి లబ్ధిదారులను తగ్గించారని విమర్శించారు. అలా కాకుండా ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ అమ్మఒడి ఇవ్వడానికి చంద్రబాబు సన్నద్ధంగా ఉన్నారని భానుప్రకాష్ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత రవాణా, యువతకు నిరద్యోగ భృతి, రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థికసాయం ప్రణాళికను చంద్రబాబు సిద్ధం చేశారని చెప్పారు. దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. ఆ మద్యంపైనే రుణాలు తీసుకొచ్చి పబ్బం గడుపుకొంటున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో మందుబాబుల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుగుణమ్మ, పనబాక లక్ష్మి, హెలెన్, థామస్, బాబు, పులివర్తి నాని, చినబాబు, ధనంజయనాయుడు, గుణశేఖర్, టీఎన్‌టీయూసీ బాలాజీ, మాధవనాయుడు, నారాయణస్వామినాయుడు, మీర తదితరులు పాల్గొన్నారు. కృష్ణారామాపురంలోనే పల్లె నిద్ర చేశారు.