వైసీపీ నేత భక్తవత్సలం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..చిత్తూరు జిల్లా, వడమాలపేట మండలం తిరుపతి-చెన్నై జాతీయ రహదారి పక్కన కదిరిమంగళం వద్ద తీవ్రగాయాలతో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఆదివారం పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం పక్కన లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెనగంపల్లెకి చెందిన వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి భక్తవత్సలం(45)గా గుర్తించారు. ఇతని స్వగ్రామం శ్రీకాళహస్తి రూరల్ మండలం చాలపాళ్యం. అయితే వెనగంపల్లెకి చెందిన లలితను వివాహం చేసుకుని, అత్తగారింట్లోనే కాపురం ఉంటున్నాడు. అధికార పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే భక్తవత్సలం శనివారం కుమార్తె పూజ్యశ్రీని కౌన్సిలింగ్ నిమిత్తం తిరుపతి తీసుకొచ్చాడు. సాయంత్రం ఎల్లమండ్యంలో ఉంటున్న తన తల్లిదండ్రులు, తమ్ముడు రాజేష్ వద్ద బిడ్డను వదిలిపెట్టాడు. చిన్న పని ఉందని వెళ్లాడు. ఆదివారం ఉదయానికి ఇలా జరిగిందని కుటుంబీకులు తెలిపారు. పుత్తూరు రూరల్ సీఐ సురే్‌షకుమార్, వడమాలపేట ఎస్‌ఐ రామాంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.