ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని రెండు రైసు మిల్లులపై పౌరసరఫరాల సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. అక్కడ అక్రమంగా బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అదేసమయంలో చీరాల వైపు నుంచి రేషన్ బియ్యం లోడుతో ఒంగోలు వైపు వస్తున్న ఒక లారీని పట్టుకున్నారు. మూడు చోట్లా రూ.6.17లక్షల విలువైన 187 క్వింటాళ్ల బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో శనివారం నుంచి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. దీంతో అక్రమ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు శనివారం రాత్రి సమాచారం అందింది. వారి ఆదేశాల మేరకు ఒంగోలు, సింగరాయకొండ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్‌లు ఆర్.వి.ఎస్. కృష్ణమోహన్, సిహెచ్.కృష్ణమోహన్‌ల ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఒంగోలులోని చంద్రశేఖర రైస్ మిల్లులో 89 క్వింటాళ్లు, మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని లక్ష్మీదత్త రైసు మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 56 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చీరాల వైపు నుంచి ఒంగోలు వైపు వస్తున్న ఒక వాహనాన్ని నాగులుప్పలపాడు మండలం కొత్తకోట వద్ద నిలిపి తనిఖీ చేశారు. అందులో 42 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. రెండు రైస్‌మిల్లులతోపాటు వాహనాన్ని సీజ్ చేశారు. ఆయా మిల్లుల నిర్వాహకులపై 6 (ఎ) కేసులు నమోదు చేశారు.