ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కాని వారికి పెన్షన్లు ఇస్తాం.... హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్

national |  Suryaa Desk  | Published : Mon, Jul 03, 2023, 10:01 PM

పెళ్లి కాని వారికి పెన్షన్ ఇచ్చేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అతి త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి విడుదల చేస్తామని.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. కర్ణాల్ జిల్లా కాలాంపురా గ్రామంలో జరిగిన జన్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా మనోహర్ లాల్ ఖట్టర్ ఈ పథకం గురించి ప్రకటన చేశారు. పెళ్లి కాని ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన పెన్షన్ కోసం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయగా.. ఈ పెళ్లి కాని వారి కోసం కూడా ఓ పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ఖట్టర్ తెలిపారు. అయితే ఈ పథకం కింద పెన్షన్ పొందే వారికి పలు షరతులు, నియమ నిబంధనలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా ఖట్టర్ వెల్లడించారు.


పెళ్లి కాని పురుషులు, స్త్రీలకు ఈ పెన్షన్ అందజేస్తామని హర్యానా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైతే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న పురుషులు, స్త్రీలు పెళ్లి కాకుండా ఉంటారో వారే ఈ పథకం కింద అర్హులు అవుతారని మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. పెళ్లి కాని వారికి నెల నెలా రూ. 3 వేల పెన్షన్‌కు అందిస్తామని చెప్పారు. వచ్చే నెల రోజుల లోపే ఈ పథకానికి శ్రీకారం చుడతామని ఖట్టర్ వ్యాఖ్యానించారు. అదే విధంగా ఇప్పటివరకు హర్యానాలో పెన్షన్ పొందుతున్న వృద్ధులకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం హర్యానాలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను.. రానున్న 6 నెలల్లో రూ. 3 వేలకు పెంచుతామని ప్రకటించారు.


ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే ఈ పెన్షన్ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఖచ్చితంగా హర్యానాలో నివసిస్తూ ఉండాలి. వారి ఆదాయం సంవత్సరానికి రూ. 1.80 లక్షలకు మించకూడదని నిబంధన పెట్టారు. ఈ పథకం కింద హర్యానా రాష్ట్రంలో 1.25 లక్షల మంది లబ్ధిదారులు పింఛను పొందేందుకు అర్హులు అవుతారని అంచనా వేస్తున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ప్రకటనలో హర్యానాలో పెళ్లి కాకుండా ఉన్న స్త్రీ, పురుషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం గురించిన వార్తలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. వయసు మీద పడి తోడు లేక బతుకుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com