ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా థియేటర్‌లో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ రేటు చూసి షాక్

national |  Suryaa Desk  | Published : Mon, Jul 03, 2023, 10:00 PM

థియేటర్లలో సరదాగా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సినిమాలకు వెళ్తూ ఉంటాం. ఇక అక్కడ టికెట్ ధరలు థియేటర్లను బట్టి ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్‌కు అయితే ఒక రేటు.. మల్టీప్లెక్స్ అయితే మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ టికెట్ ధరలను కాసేపు పక్కన పెడితే అక్కడ తిను బండారాల రేటు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉండే ఫుడ్ ఐటెమ్స్ రేటు అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే చాలా మంది కేవలం సినిమా మాత్రమే చూసి.. బయటకు వచ్చి అదే రేటుతో హోటల్‌లో ఇష్టమైన ఫుడ్ లాగించేయవచ్చు అని భావిస్తారు. కానీ కొంత మంది తమ ప్రియురాలితో వచ్చిన వారు ఎంత ఖర్చైనా సరే కొన్ని కొనక తప్పదు. ఇక చిన్న పిల్లలు ఉంటే అవి కొనిచ్చేదాగా వదిలిపెట్టరు. అయితే ఇలాంటి సంఘటనే ఓ వ్యక్తికి జరిగింది. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ తీసుకున్న ఆ వ్యక్తి బిల్లు చూసి అవాక్కయ్యాడు.


ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పీవీఆర్ సినిమాస్‌కు వెళ్లిన త్రిదిప్ కే మండల్ అనే వ్యక్తికి ఎదురైన సంఘటనను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. తాజాగా ఓ సినిమాకు వెళ్లిన త్రిదిప్.. ఇంటర్వెల్ సమయంలో అక్కడ ఉన్న దుకాణానికి వెళ్లాడు. ఒక పాప్‌కార్న్, ఒక కూల్‌డ్రింక్ తీసుకున్నాడు. వాటికి అతనికి ఇచ్చిన బిల్లును చూసి త్రిదిప్.. నోరేళ్ల బెట్టాడు. ఎందుకంటే రెండూ కలిపి రూ. 820 బిల్లు వేశారు. ఒక చీజ్ పాప్‌కార్న్, ఒక పెప్సీ తీసుకున్నందుకు తనకు రూ. 820 బిల్లు వేశారని ట్విటర్ వేదికగా త్రిదిప్ ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి సంబంధించిన బిల్‌ను కూడా షేర్ చేశాడు. దీంతో దీనిపై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. దెబ్బకు త్రిదిప్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.


తనకు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌కు రూ. 820 అయ్యిందని.. ఇక సినిమా టికెట్ కలుపుకుంటే అది రూ.1000 దాటిపోయిందని వాపోయాడు. ఈ ఒక్క సినిమా చూడటం కోసం తాను చేసిన ఖర్చుతో ఏడాది పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కావాల్సినన్ని సినిమాలు చూడొచ్చని తన ట్వీట్‌కు క్యాప్షన్‌ పెట్టాడు. ఇలా దోచుకుంటున్నారనే భయంతోనే థియేటర్ల వైపు జనం రావడం లేదని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. సినిమా థియేటర్లలో ఇంత రేట్లు ఉంటే ఎలా వెళతామని కొందరు ట్వీట్లు చేస్తుంటే.. "ఇంటికెళ్లి భోజనం చేయండి.. పాప్‌కార్న్‌ డబ్బులను ఆదా చేసుకోండి" అని మరికొందరు సూచిస్తున్నారు. థియేటర్‌కు వెళ్లి సినిమా మాత్రమే చూడండి.. తినడం కోసం మాత్రం వెళ్లొద్దని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.


క‌రోనా మ‌హ‌మ్మారి వెలుగు చూసిన తర్వాత ఓటీటీలు బాగా పాపులర్ అయ్యాయి. కొన్ని సినిమాలైతే డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే విడుదల చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే కూర్చొని ఇష్టం ఉన్నపుడు చూసుకునే వీలుండటం ఈ ఓటీటీలతో మరో ఉపయోగం. ఓటీటీల రాక‌తో థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వెళ్లడం బాగా త‌గ్గిపోయింది. మ‌రోవైపు కుటుంబ స‌భ్యుల‌తో థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడ‌టానికి భారీగా ఖ‌ర్చు అవుతుండటంతో ఓటీటీ వైపు జ‌నాలు బాగా చూస్తున్నారు. ఇక ఇలా బిల్లులతో వాయిస్తుంటే థియేటర్లకు ఎవరూ రారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com