ఉత్తర్‌ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు సంచలన విషయం వెల్లడైంది. ఓ అద్దె ఇంట్లో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటోందని పోలీసులు వెల్లడించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఆశ్రయం కల్పించాడని తెలిపింది. అతనితో ఆమెకు పబ్‌జీ అనే ఆన్‌లైన్ గేమ్‌లో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది.
పాకిస్థాన్ మహిళ అక్రమంగా భారత్‌లో నివాసం ఉంటోందని తెలిసి అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను అదుపులోకి తీసుకుని.. ఆ వ్యక్తి వివరాలు రాబట్టారు. ఆ సమాచారంతో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాద్ మియాఖాన్ వెల్లడించారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు డీసీపీ తెలిపారు.
గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతానికి చెందిన వ్యక్తికి.. 20 ఏళ్ల మహిళకు.. పబ్‌జీలో పరిచయం అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ పరిచయం వారి ఇద్దరి మధ్య స్నేహానికి దారి తీసిందని పేర్కొన్నారు. కొన్ని రోజులు ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నట్లు తెలిపారు. దీంతో ఆమె భారత్‌కు వచ్చేందుకు నిర్ణయించుకుందని వివరించారు. అయితే ఆమెకు అప్పటికే పెళ్లి అయి నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు. నలుగురు పిల్లలతో కలిసి గత నెలలో ఆమె భారత్‌కు అక్రమ మార్గాల ద్వారా వచ్చినట్లు గుర్తించారు.
పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చేందుకు ఆ పాక్ మహిళ పెద్ద స్కెచ్ వేసింది. మొదట పాక్ నుంచి నేపాల్ చేరుకుని.. అక్కడి నుంచి గత నెలలో భారత్‌లోకి వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ప్రయాణంలో నలుగురు పిల్లలను తన వెంటబెట్టుకునే వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అలా నేపాల్ నుంచి నేరుగా ఉత్తర్‌ప్రదేశ్ చేరుకుందని.. అక్కడి నుంచి బస్సులో గ్రేటర్ నోయిడాకు వచ్చినట్లు తెలిపారు. మరిన్ని విషయాల కోసం పాక్ మహిళతో పాటు నోయిడాకు చెందిన వ్యక్తిని కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఈ సంఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. దేశంలో ఏదైనా ఉగ్ర దాడులు చేసేందుకు మహిళను ఉపయోగించుకుంటున్నారా అన్న అనుమానంతోనూ విచారణ చేస్తున్నారు.