తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్యతో పొలిటికల్ హీట్ రేగింది. ఆస్పత్రిలో ఆనందరావు మృతదేహాన్ని పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఐ చాలా మంచి వ్యక్తి.. నోరు లేని వ్యక్తి కాబట్టే చనిపోయారన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఆత్మహత్య చేసుకున్నారని.. అందుకే చనిపోయారని తాను ప్రమాణం చేస్తానని.. 'మీరెవరైనా ప్రమాణం చేస్తారా' అంటూ సవాల్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిడి వల్లే సీఐ చనిపోయారని.. కేతిరెడ్డికి ఈగోడు తగులుతుందన్నారు. ఏదైనా అంటే సజ్జల ఫోన్ చేసి పోలీసులపై ఒత్తిడి చేస్తారని.. ఇలాగైతే తాడిపత్రిలో పనిచేయటానికి ఎవరు రారన్నారు. ఆదివారం మధ్యాహ్నం డీఎస్పీ ఆఫీస్‌కి సీఐ ఆనందరావు వెళ్ళారని.. అక్కడ ఫయాజ్ బాషా ఉన్నారన్నారు. అక్రమ కేసులు పెట్టాలని సీఐపై ఒత్తిడి చేశారని.. ఆదివారం సీఐ ఆనందరావు ఎవరెవరిని కలిశారో విచారణ జరిపించాలన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని.. కుటుంబ కలహాలతో సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని.. టీడీపీ పాలనలో పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు.. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆనందరావు ఆత్మహత్య విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. సీఐ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. ఆనందరావు తొమ్మిది నెలల క్రితం తాడిపత్రి సీఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాడిపత్రిలోనే అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడేవారని కుటుంబసభ్యుల వాదన. అయితే కొంతకాలంగా భార్యతో సీఐకు గొడవలు జరుగుతన్నట్లు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత కుటుంబసభ్యులు నిద్రపోయిన తర్వాత ఇంట్లోనే సీఐ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆనందరావు సొంత ఊరు చిత్తూరు జిల్లా చంద్రగిరి కాగా.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.