టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని మాజీ మంత్రి పరసా రత్నం, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పులివర్తి నాని తెలిపారు. మహానాడు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సు యాత్ర సోమవారం చిన్నగొట్టిగల్లు మండలంలోకి ప్రవేశించింది.ఈ సందర్భంగా రంగన్నగారిగడ్డలో సాయంత్రం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో వారు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతే రిచ్ టు పూర్, అన్నదాత, ఇంటింటికీ సురక్షిత తాగునీటి కనెక్షన్, మహాశక్తి, యువగళం, బీసీలకు రక్షణ చట్టం పథకాలకు చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ ముఖ్యమంత్రి జగన్ చేతిలో మోసపోయారని, వారందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకే చంద్రబాబు ఆ ఆరు పథకాలను రూపొందించారన్నారు. మినీ మేనిఫెస్టో ప్రకటనకే వైసీపీ నాయకులు భయపడిపోతున్నారని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు ప్రకటిస్తారని తెలిపారు.