కొందరు భక్తుల తీరు అపుడపుడూ వివాదానికి కారణమవుతుంటుంది. భక్తికొద్దీ ఫలితం. దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. తెలిసీ తెలియక పప్పులో కాలేస్తుంటారు. అలాంటి అపచారమే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని వేమవరంలో చోటు చేసుకుంది. మంగళవారం (జూలై 3) గురుపూర్ణిమ సందర్భంగా సాయి బాబా ఆలయంలో కొంత మంది భక్తులు చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వేమవరంలో సాయిబాబా దేవాలయాన్ని పునర్నిర్మించారు. గురుపూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో బాబా విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేశారు. అయితే, ఆ అభిషేకం కోసం తీసుకొచ్చిన పంచామృతాన్ని మద్యం బాటిళ్లలో నింపుకొచ్చారు. ఆ బాటిళ్లతో అలాగే బాబా విగ్రహంపై పంచామృతం కురిపించారు.
దేవుళ్లకు అభిషేకం అత్యంత ప్రీతిపాత్రం అని పండితులు చెబుతారు. అందుకు పాలాభిషేకాలు, నెయ్యాభిషేకాలు, పంచామృతంతో అభిషేకాలు చేస్తారు. పాలు, పంచదార, తేనె, పెరుగు, నెయ్యి.. ఈ 5 పదార్థాలను కలిపితే ‘పంచామృతం’ అని పిలుస్తారు. దేవుడిని అభిషేకించిన పంచామృతాన్ని అమృతంగా భావించి, ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే, అలాంటి పవిత్రమైన పంచామృతాన్ని బీరు బాటిళ్లలో నింపుకురావడం కొంత మంది భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. గరుపూర్ణిమ సందర్భంగా ఈ ప్రత్యేక పూజలకు సంబంధించిన దృశ్యాలను కొంత మంది భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ క్రమంలో సాయిబాబా విగ్రహంపై పంచామృతం కురిపిస్తున్న బాటిళ్లపై కొంత మంది దృష్టి పడింది. ఇదేంటి అని ప్రశ్నిస్తుండటంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
‘అవి బీరు బాటిళ్లు కాకపోవచ్చు.. సాస్ బాటిళ్లు కావొచ్చు’ అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. అయితే, వీడియోలో బీరు సీసాలే కాకుండా విస్కీ బాటిళ్లు కూడా కనిపిస్తున్నాయంటూ మరి కొంత మంది వాదిస్తున్నారు. ఏదేమైనా.. దేవుడి అభిషేకం కోసం పంచామృతం పోసేందుకు ప్రత్యేక పాత్రలను ఉపయోగిస్తారు. వీళ్లకు మద్యం బాటిళ్లు తప్ప మరేందొరకలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది అపచారమేనని మండిపడుతున్నారు.