ఎన్సీపీలో ముసలంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండుగా చీలిపోయిన ఎన్సీపీలో పోటాపోటీగా తొలగింపులు, నియామకాలు జరిగాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ఎంపీ సునీల్ తత్కరేలపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు పవార్ సోమవారం ప్రకటించారు. షిండే ప్రభుత్వంలో మంత్రులుగా చేరిన వారిలో తత్కరే కుమార్తె అదితి కూడా ఉండడం గమనార్హం. ఇదే సమయంలో అజిత్ వెంట్ వెళ్లిన ప్రఫుల్ పటేల్‌పై శరద్ పవార్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
మా ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కష్టపడి ఎన్నికల్లో గెలిస్తే.. ప్రఫుల్ పటేల్ పేపర్లు నింపి రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి పార్టీలో ఉండటానికి అనర్హుడని పవార్ వ్యాఖ్యానించారు. 1980లోనూ ఇలాగే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని, అప్పట్లో పార్టీని మళ్లీ పునర్నిర్మించామని ఆయన స్పష్టం చేశారు.
అటు, ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సీఎం ఏక్‌నాథ్ షిండే శివసేన తరహాలో తమకూ ఒక గ్రూపును ప్రకటించుకున్నారు. శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్‌ను ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రఫుల్, సునీల్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పవార్ ప్రకటించిన కొద్ది సేపటికే.. అజిత్ పవార్ పార్టీలో తమ ‘గ్రూపు లీడర్’ అని ప్రఫుల్ ప్రకటించడం విశేషం.
‘‘పార్టీలోని మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని అంగీకరించాల్సిందిగా శరద్ పవార్‌ను కోరుతున్నాం. మాకు ఆయన ఆశీస్సులు కావాలి’’ అని చెప్పారు. పార్టీ ఎవరిది? గుర్తు ఎవరిది? వంటి అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రెబల్స్ సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించారు. మెరుగైన మహారాష్ట్ర కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ పవార్ తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉన్నందువల్లే డిప్యూటీ సీఎం అయ్యాయని ఆయన చెప్పారు.
ఇదే సమయంలో సోమవారం సాయంత్రం కీలక పరిణామం చోటుచేసుకుంది. అజిత్ పవార్ వెంట వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంలో చేరడం గమనార్హం. సతారా ఎమ్మెల్యే మకరంద్ పాటిల్, ఉత్తర కరాడ్ ఎమ్మెల్యే బాలాసాహెబ్ పాటిల్‌లు శరద్ పవార్ క్యాంపులో చేరారు. అలాగే, ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన అజిత్ పవార్ ప్రమాణస్వీకారానికి హాజరైన శిరూర్ ఎంపీ అమోల్ కొల్హే సైతం తానూ అధినేత శరద్ పవార్ వెంటే ఉంటానని ప్రకటించారు.