తిరుమల శ్రీవారి హుండీ ఆలయ ముఖద్వారం వద్ద జారి కింద పడిపోయింది. శ్రీవారి ఆలయంలో హుండీ నిండిన అనంతరం ఆలయం వెలుపలికి తీసుకువచ్చి లారీ ద్వారా నూతన పరకామణికి తీసుకువెళతారు. దీనిలో భాగంగా హుండీని పరకామణికి తీసుకువెళ్లేందుకు లారీలోకి ఎక్కిస్తుండగా ఆలయ ముఖద్వారం వద్ద హుండీ జారికిందపడింది. దీంతో అందులో ఉన్న నగదు కొంత బయటికి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుండీను లారీలోకి జాగ్రత్తగా ఎక్కించారు.
అయితే కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుని దర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం రోజు స్వామివారిని 77,299 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,479 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3.93 కోట్ల ఆదాయం వచ్చింది.