పాములను చూస్తే చాలు ముంగిసలే కాదు.. కుక్కలు కూడా వాటితో పోరాడతాయి. ఇక పెంపుడు కుక్కలైతే.. తమ ప్రాణాలు పోతున్నా సరే లెక్క చేయకుండా.. పామును మట్టుబెడతాయి. ఓ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించిన పాము.. తమ పిల్లలకు ఎక్కడ హాని తలపెడుతుందోననే భావనతో శునకాలు కలిసికట్టుగా దానితో పోరాడి చంపేశాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటి ప్రాంగణంలో ఉన్న కర్రలు, పొదల మధ్యలో ఉన్న పామును చూసిన శునకం.. దాన్ని బయటకు నోటితో లాగి బయటకు విసిరి కొట్టింది. పామును చూసిన మరో రెండు కుక్కలు కూడా దానితో పోరాటానికి రంగంలోకి దిగాయి. తనను తాను కాపాడుకోవడం కోసం పాము బుసలు కొడుతున్నా సరే.. శునకాలు వెనక్కి తగ్గలేదు. ఒక దాని తర్వాత మరొకటి.. తమ పదునైన దంతాలతో ఆ పామును పీకి పెట్టాయి. అక్కడే ఉన్న బుజ్జి కుక్క పిల్లలు కూడా పాముపై దాడికి ప్రయత్నించాయి. మూడు కుక్కలు మూకుమ్మడిగా దాడికి దిగడంతో.. ఆ పాము ఎంతో సేపు పోరాడలేకపోయింది. నడుము, మెడ భాగంలో కుక్కలు గట్టిగా కరవడంతో.. అది చనిపోయింది. ఒక నిమిషంలోనే మూడు శునకాలు కలిసి పామును చంపేశాయి.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పామును చంపేసే క్రమంలో.. కుక్కలు ఏమైనా దాని కాటుకు గురయ్యాయో లేదో కూడా తెలియలేదు.
గతంలోనూ పాముతో కుక్కలు పోరాడిన ఘటనలు ఉన్నాయి. 2020లో తమిళనాడులోని మధురైలో ఓ పెంపుడు శునకం తన యజమాని కుటుంబాన్ని పాము కాటు నుంచి కాపాడే క్రమంలో కన్నుమూసింది. ఇంటి వరండాలోకి ప్రమాదకరమైన రక్తపింజర ప్రవేశించడాన్ని పసిగట్టిన శునకం.. దానితో పోరాటానికి దిగింది. కుక్క ముఖం, తొడ భాగంలో పాము కాటేసినా సరే.. అది వెనక్కి తగ్గలేదు. ఒళ్లంతా విషం వ్యాపిస్తున్నా సరే.. ఆ పాముతో పోరాడి చంపేసింది. అలికిడికి ఇంటి యజమానికి లేచి చూసే సరికి పాము చచ్చిపడి ఉండగా.. కుక్క బతికే ఉన్నప్పటికీ.. కదల్లేని స్థితిలో ఉంది. దీంతో వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్ చేయగా.. అప్పటికే విషం ఒళ్లంతా వ్యాపించడంతో ఆ శునకం కోమాలోకి వెళ్లింది. దాన్ని కాపాడేందుకు వెటర్నరీ డాక్టర్లు ప్రయత్నించినప్పటికీ.. మరుసటి రోజు రాత్రి అది కన్నుమూసింది.