కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్ల రంగు మారింది. ఇప్పటి వరకూ తెలుపు, నీలం వర్ణంలో ఉన్న వందేభారత్ రైళ్లు.. ఇకమీదట కాషాయ రంగులో కనిపించనున్నాయి. ఈ రైళ్లకు కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. దీంతో త్వరలో ప్రారంభం కాబోయే వందే భారత్ రైలుకు కాషాయ రంగు వేశారు. రైలు బయటి భాగం ఎక్కువగా తెలుపు రంగులో ఉండటం వల్ల మట్టి అంటుకుని మురికిగా కనిపించే అవకాశముందని, అందువల్ల కాషాయ రంగుకు మార్చాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.
చెన్నైలోని ఇంటెగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో కాషాయ రంగుతో సిద్ధంగా ఉన్న వందే భారత్ రైలును కేంద్రం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం పరిశీలించారు. జాతీయ జెండా స్ఫూర్తితోనే వందే భారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
‘ఇది మన స్వంత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులతో దేశంలో రూపుదిద్దుకున్న మేక్ ఇన్ ఇండియా (అంటే) భావన.. వందే భారత్ ఆపరేషన్ సమయంలో ఏసీ, టాయిలెట్లు మొదలైన వాటికి సంబంధించి ఫీల్డ్ యూనిట్ల నుంచి మాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను వాటి డిజైన్‌లో మార్పులు చేయడానికి ఉపయోగిస్తున్నాం’ అని వైష్ణవ్ చెప్పారు. ‘మేము వినియోగిస్తోన్న కొత్త భద్రతా ఫీచర్, యాంటీ క్లైంబర్స్ లేదా యాంటీ-క్లైంబింగ్ పరికరాలు కూడా ఈ రోజు సమీక్షించాం.. ఇవి అన్ని వందే భారత్, ఇతర రైళ్లలో ప్రామాణిక ఫీచర్లుగా ఉంటాయి’ అని పేర్కొన్నారు.
త్వరలోనే దేశవ్యాప్తంగా సంప్రదాయక పర్యాటక మార్గాలను అనుసంధానం చేస్తూ ‘టి ట్రైన్’లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ప్రాచీన ‘స్టీమ్ ఇంజన్’ తరహాలో రూపొందించిన విద్యుత్ రైలింజన్‌తో కూడిన ‘టి ట్రైన్’ను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో మంత్రి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ హెరిటేజ్ స్పెషల్ రైలును మూడు నెలల్లోనే దేశంలో నడపనున్నట్టు వెల్లడించారు. ప్రజల్లో స్టీమ్ ఇంజన్ పట్ల ఉన్న ఆకర్షణ, అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని అదే తరహాలో విద్యుత్ ఇంజన్‌ను రూపొందించామని ఆయన తెలిపారు.
ఈ ప్రత్యేక రైలును తొలుత ప్రయోగాత్మకంగా పురాతన చారిత్రక స్థలాల మార్గాల్లో నడుపుతామని, ఆ ట్రయల్ రన్ పూర్తయ్యాక దేశంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెడతామని చెప్పారు. అలాగే, దక్షిణాదిలో మరిన్ని వందేభారత్ రైళ్లు ప్రవేశపెడతామన్నారు. అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేయడమే ప్రధాని తమకు నిర్దేశించిన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు
చెన్నైలోని ఐసీఎఫ్‌లో ఇప్పటి వరకూ 25 రకాల డిజైన్లలో 70 వేల బోగీలు తయారయ్యాయి. వందే భారత్ రైలు బోగీలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఐసీఎఫ్‌లో తయారైన మొత్తం 25 వందే భారత్ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తున్నాయి. 2023-24లో ఈ కర్మాగారంలో 736 వందే భారత్ రైలు బోగీలు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.