ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్టయిలే వేరు. ఎటువంటి పరిస్థితులలోనూ తన లగ్జరీ జీవితాన్ని మాత్రం ఆయన వదులుకోరు. ప్రస్తుతం దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అయినా కిమ్ మాత్రం తన లగ్జరీ జీవితానికి ఏమాత్రం లోటురానీయడం లేదు. ఖరీదైన మద్యం, సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసం రుచిని ఆయన ఆస్వాదిస్తున్నాడట. ఈ మేరకు యూకే రక్షణ రంగ నిపుణుడు ఒకరు డైలీ స్టార్ పత్రికకు వెల్లడించారు. కిమ్ జాంగ్ 7 వేల డాలర్లు విలువ చేసే హెన్నెస్సీ బ్రాందీని తాగుతాడని పేర్కొన్నారు. అంటే మన కరెన్సీలో రూ.5 లక్షలకు పైమాటే!
కొన్ని సంవత్సరాల క్రితం చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ తెలిపిన ట్రేడ్ డేటా ప్రకారం.. విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్ ప్రతి ఏటా 30 మిలియన్ డాలర్ల మేర వెచ్చిస్తారు. తనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి సంవత్సరం 9.6 లక్షల డాలర్లను వెచ్చిస్తున్నారు. ఆయన తాగే సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని చెబుతున్నారు. మద్యంతో పాటు కిమ్ ఇటలీలోని పర్మా ప్రాంతంలో తయారు చేసే పర్మా హోమ్, స్విస్ చీజ్ నూ దిగుమతి చేసుకుంటారు. కిమ్ వద్ద గతంలో వంట చేసిన చెఫ్ ఒకరు యూకే టాబ్లాయిడ్ తో మాట్లాడుతూ... కిమ్, అతని తండ్రి కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం కోబ్ స్టీక్స్, క్రిస్టల్ షాంపైన్ తో భోజనం చేసేవారని చెప్పారు.
1997లో కిమ్ పిజ్జాలు చేసేందుకు ఇటలీ నుండి ఖరీదైన చెఫ్ ను రప్పించాడు. యూకే మెట్రో రిపోర్ట్ ప్రకారం... 2014లో కిమ్ లో లైంగిక సామర్థ్యం పెరిగేందుకు ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడు. అమెరికా నుండి మార్ల్ బోరో సిగరెట్లు, నిద్రలేమికి చికిత్స చేసే జిల్పీడెమ్ వంటి వాటిని దిగుమతి చేసుకునేవారు. కరోనా తర్వాత ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. చైనా నుండి ఎరువులు, ఆహార ఉత్పత్తికి అవసరమైన పరికరాలు, ధాన్యాల దిగుమతిని ఉత్తర కొరియా నిలిపివేసింది. దీంతో ఇక్కడ పంట దిగుబడి తగ్గి, ఆహార సంక్షోభం తలెత్తింది. కానీ కిమ్ విలాసాలు మాత్రం తగ్గడం లేదు. ఉత్తర కొరియాలో 2.6 కోట్ల జనాభా ఉంది.