ఇప్పటికే టమాటా సహా ఇతర కూరగాయల ధరలు సామాన్యున్ని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటా రూ.150కి చేరుకుంది. అయితే, వర్షాలు, వరదల వల్ల రాబోయే రోజుల్లో టమాటా సహా అన్ని కూరగాయల ధరలు పెరగవచ్చని తెలుస్తోంది. వర్షాల తాకిడికి రహదారులు దెబ్బతినగా, కూరగాయల రవాణా స్తంభించిపోయింది. కూరగాయల సాగు తగ్గడం కూడా ఈ పరిస్థితికి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
‘ఈ సీజన్‌లో హిమాచల్ నుంచి క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యాప్సికం పెద్ద మొత్తంలో ఇతర రాష్ర్టాలకు రవాణా అవుతుంది. ఈసారి అక్కడ సాగుచేస్తున్న పంటలన్నీ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. కర్ణాటకలో టమాటాకు కీటకాల బెడద ఎక్కువైంది. దీంతో దిగుబడి పడిపోయి, కూరగాయల ధరలు మరింత పెరగవచ్చు’ అని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్‌కే సింగ్ చెప్పారు. కూరగాయలకు బదులు పప్పులు కొనటం పెరుగుతున్నదని, వీటి ధరలు పెరగటం కూడా మొదలైందని ఆయన గుర్తుచేశారు. టమాటా మార్కెట్‌కు రావటం తగ్గటంతో ఒక్కవారంలోనే ధర రూ.150కి పెరిగిందని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ టమాటా ట్రేడర్ అమిత్ మాలిక్ అన్నారు.