స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆప్యాయంగా పలుకరించే వలంటీర్ సోదరులకు దురుద్దేశాలను ఆపాదించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వలంటీర్లుగా దాదాపు 53 శాతం మంది యువతులు సేవలందిస్తుండగా సాటి మహిళలకు వారెందుకు చేటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి విరుచుకుపడ్డ వేళ బాధితుల వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులే వెనుకాడినా వలంటీర్లు మానవత్వంతో అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. పవన్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుని వలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల వలంటీర్లు ఆగ్రహంతో ఊగిపోతూ పవన్‌కళ్యాణ్ ఫోటోలు, పోస్టర్లను చెప్పుతో కొడుతూ నిరసన తెలిపారు. దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు.