టమాటాలను ఒక్కోసారి కిలోకు రూ.1, రూ.2 కే విక్రయించలేక రైతులు పొలాల్లోనే వదిలేసేవారు. ఇక టమాటాలను మార్కెట్లకు తీసుకువచ్చి ధర లేక పారబోసిన సంఘటనలను మనం ఎన్నో చూశాం. అప్పుడు పంట వేసిన రైతులకు కన్నీరు తెప్పించిన టమాటాలు ఇప్పుడు వినియోగదారుల జేబును ఖాళీ చేస్తున్నాయి. ఈ క్రమంలో టమాటాలకు డిమాండ్ బాగా పెరిగింది. మరి ఇలాంటప్పుడు దొంగలు ఊరుకుంటారా. తమ హస్తలాఘవం చూపిస్తున్నారు. టమాటాలు ఎక్కడ కనబడినా ఎత్తుకెళ్లి పోతున్నారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కూరగాయలు అమ్మే వ్యాపారి తన వద్ద ఉన్న టమాటాలకు ఇద్దరు బౌన్సర్లను పెడితే అతనికేమైనా పిచ్చి ఉందా అని విమర్శించిన జనాలే.. ఇప్పుడు టమాటాలు ఎత్తుకెళ్తున్న దొంగలను చూసి.. ఆ వ్యాపారి చేసింది కరెక్టే అని అంటున్నారు. సోమవారం కర్ణాటకలో టమాటాల లోడుతో ఉన్న ట్రక్కును దుండగులు చోరీ చేయగా.. తాజాగా రాజస్థాన్‌లో కూరగాయల దుకాణంలో ఉన్న టమాటా పెట్టెలను ఎత్తుకెళ్లి పోయారు.
కర్ణాటకకు చెందిన ఓ రైతు తన టమాటా పంటను తీసుకుని మార్కెట్ యార్డుకు వెళ్లాడు. చిత్రదుర్గకు చెందిన రైతు దాదాపు రూ.3 లక్షల విలువైనా 3,750 కిలోల టమాటాలను ఓ ట్రక్కులో నింపుకుని స్థానికంగా ఉన్న ఆర్‌ఎంసీ యార్డుకు చేరుకున్నాడు. అయితే ట్రక్కును ఆపి.. అక్కడ డ్రైవర్‌తోపాటు ఆ రైతు ఛాయ్ తాగడానికి వెళ్లాడు. అది గమనించిన దుండగులు టమాటాలతో సహా ట్రక్కును దొంగలించారు. దీంతో ఖంగుతున్న రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందు తమను ముగ్గురు వ్యక్తులు వెంబడించారని.. మార్గమధ్యలో ఒకసారి తమ ట్రక్కును ఢీకొట్టారని తమతో వాగ్వాదానికి దిగారని తెలిపారు. వాళ్లే తమ టమాటా ట్రక్కును ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉండగా.. మంగళవారం రాజస్థాన్‌లోనూ టమాటాలు చోరీ అయ్యాయి. జైపూర్‌లోని మోహనా వెజిటెబుల్ మార్కెట్‌లోని కూరగాయల దుకాణంలో ఉన్న టమాటాలను దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. దాదాపు 150 కిలోల 6 టమాటా బాక్సులు దొంగతనానికి గురైనట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దొంగలు టమాటా బాక్సులను ఎత్తుకెళ్లిన దృశ్యాలు ఆ దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై సదరు కూరగాయల దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా టమాటాల దొంగతనం ఘటనతో అప్రమత్తమైన మోహనా వెజిటెబుల్ మార్కెట్.. మార్కెట్‌లోని దుకాణదారులకు పలు సూచనలు చేశారు. యజమానులు అందరూ తమ కూరగాయలను రక్షించుకోవాలని మార్కెట్ అధ్యక్షుడు సూచించారు.