ఏలూరు నగరంలో ఘోరం జరిగింది. భీమవరం పోలీస్ వారి వివరాల ప్రకారం .... ఏలూరు గన్‌బజార్‌కు చెందిన పటాన్ సంసేర్ ఖాన్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కరిష్కా, రెండో భార్య షకీలా. మొదటి భార్యకు ఒక కుమారుడు, కుమార్తె. రెండో భార్యకు ముగ్గురు అమ్మాయిలు. వీరిలో రెండో అమ్మాయి షేక్ అపీరాను భీమవరం 18వ వార్డు పాలూరివారి వీధికి చెందిన కరీముల్లాకు ఇచ్చి వివాహం చేశారు. అపీరా వివాహం తరు వాత తల్లిదండ్రులతో మాట్లాడంమానేసింది. రెండు రోజుల క్రితం సంసేర్‌ఖాన్ రెండో భార్య షకీలా ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో సంసేర్‌ఖాన్ తన కుమార్తె అపీరా వద్దకు వెళ్లి ఉంటుందన్న అపోహతో కుమారుడు అప్రోజు, కుమార్తె యాసిన్, అల్లుడు మజుబుతో కలిసి ఈనెల 10వ తేదీ రాత్రి భీమవరం చేరుకున్నారు. కుమార్తె అపీరా నివాసానికి వెళ్లి తలుపు కొట్టారు. అపీరా మామ మహబూబ్ జానీ (58) తలుపు తీయగా నా భార్య ఇక్కడ ఉందా అని సంసేర్‌ఖాన్ అడిగాడు. ఇక్కడకు ఎందుకు వస్తుంది.. మీకు మాకు మాటల్లేవు కదా అని అపీరా నిలదీయగా కోపోద్రుక్తుడైన పటాన్ సంసేర్‌ఖాన్ కత్తితో మహబూబ్ జానీ పొట్టలో పొడిచాడు. అడ్డువెళ్లిన అపీరా మరిది షేక్ రహీమ్‌ను పొడిచాడు. అప్రోజు, యాసీన్, మజుబు సహకరించారు. అపీరా కేకలు వేయడంతో ఆమెను కూడా పొడిచాడు. వారిని వెంటనే స్థానికులు సహాయంతో భీమవరం ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. మహబూబ్ జానీ పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. నిందితులు నలుగురు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.