రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వ్యవసాయ సర్వీసుల కోసం కొత్త విద్యుత్ లైన్ల మార్పునకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిస్కం డైరెక్టర్ సుబ్బరాజు తెలిపారు. చిత్తూరులో మంగళవారం ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యుత్ లైన్లు మార్పు చేసి సుమారు 20 ఏళ్లకుపైగా అయిందన్నారు. కొత్తవి వేయడం కోసం పాత లైన్లను జియోట్యాగింగ్ ద్వారా సర్వే చేయనున్నట్లు చెప్పారు. సుమారు రూ.వెయ్యి కోట్లు చిత్తూరు ఉమ్మడి జిల్లాకు ఖర్చు చేయనున్నట్లు అన్నారు. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఈ పనులు పూర్తయితే గ్రామాలకు నాణ్యమైన త్రీఫేజ్ సరఫరా ఇవ్వొచ్చన్నారు. గత సంవత్సరంలోనే 80 వేల వ్యవసాయ సర్వీసులు ఇచ్చామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురైన 48 గంటల్లోనే మరొకటి ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.