ఏపీలో ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. మరో 9 నెలల్లో ఎన్నికలు వస్తాయని, సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించేశారు. ఎన్నికలకు సిద్ధంకావాలని రాష్ట్ర మంత్రులను ఆదేశించారు. మరో 9 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేబినెట్ భేటీలో అజెండాలోని అంశాలపై చర్చ తర్వాత మంత్రులతో సీఎం జగన్ కీలక విషయాలు మాట్లాడారు. రాష్ట్రంలో మరో 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని వెల్లడించారు. అలాగే, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మంత్రులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంపై కూడా మంత్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇకపై మంత్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. సొంత జిల్లాల్లోనే కాకుండా ఇన్‌ఛార్జ్ జిల్లాల్లోనూ మంత్రుల పర్యటనలు, పర్యవేక్షణ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలకు ఆమోదముద్ర వేసింది. మూడున్నర గంటల పాటు 55 అంశాలపై ఈ భేటీ కొనసాగగా.. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. అలాగే, అసైన్‌మెంట్, నిరుపేదలకు ఇచ్చిన భూముల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కీలక అంశాలను ప్రస్తావించారు.