తిరుమల శ్రీవారి హుండీకి దాదాపు రెండు నెలల తర్వాత.. ఒక రోజు రూ.5కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. సోమవారం వెంకన్నను 64వేల 347 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28,358 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఇటీవల కాలంలో ఆదాయం రూ.5 కోట్లలోపే ఉంది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ మార్క్ అందుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
మరోవైపు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెలా రూ.వంద కోట్ల మార్కును దాటేస్తోంది. గతేడాది మార్చి నుంచి ప్రతి నెలా హుండీ ఆదాయం ఆ మార్కును అందుకుంటోంది. గత నెల జూన్‌లో వంద కోట్ల మార్కును దాటింది.. జూన్ 1 నుంచి 30 వరకు 20,00,187 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.166.14 కోట్లు లభించింది. గత నెల 18న అత్యధికంగా రూ.4.59 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
మరోవైపు టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భజనమండళ్ల శోభాయాత్ర వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ ప్రారంభంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి రైల్వేస్టేషన్ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుంచి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు సంకీర్తనాలాపన జరిగింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధార్మిక సందేశం అందించారు.
సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. హరినామసంకీర్తన ప్రజల్లో అశాంతిని దూరం చేస్తుందన్నారు ఆనందతీర్థాచార్యులు. కలియుగంలో స్వామివారిని సేవించడం ఎంతో పుణ్యఫలం అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 3500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శోభాయాత్రగా మూడో సత్రం ప్రాంగణానికి చేరుకున్నారు. దారి పొడవునా వారు చేసిన భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి సంగీత విభావరి,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జూలై 12న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని దర్శించుకుంటారు.