బస్సు కండక్టర్‌తో ఓ ప్రయాణికురాలు అమర్యాదగా ప్రవర్తించింది. ముస్లిం కండక్టర్‌ను వేధించిన ఆ మహిళ.. డ్యూటీలో టోపీ ఎందుకు పెట్టుకున్నావని అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు, అంతగా ఇష్టముంటే మసీదు లేదా ఇంట్లో పెట్టుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన బెంగళూరు మెట్రోపాలిటిస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)లో చోటుచేసుకోగా.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టోపీ ధరించిన ఉన్న కండక్టర్‌తో ఆ మహిళ వాదనకు దిగడం వీడియోలో రికార్డయ్యింది. యూనిఫామ్‌తో పాటు టోపీ పెట్టుకోడానికి నీకు అనుమతి ఉందా? అని నిలదీస్తోంది.
దీనికి కండక్టర్ బదులిస్తూ చాలా సంవత్సరాలుగా తాను టోపీ పెట్టుకుని డ్యూటీ చేస్తున్నా.. ఎవరూ తనను ఇలా ప్రశ్నించలేదని చెప్పారు. దీంతో ఆ మహిళ ‘నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావు? నీకు అంతగా ఇష్టముంటే మసీదులో లేదా ఇంట్లో పెట్టుకో డ్యూటీలో కాదు.. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా విధుల్లో ఉండేటప్పుడు టోపీ పెట్టుకోకూడదు’ అంటూ వాదించింది.
టోపీ ధరించడానికి అనుమతి ఉండొచ్చని కండక్టర్ సమాధానం ఇవ్వగా.. నిబంధనలు తెలియకుంటే టోపీ తీసి ‘రూల్స్ పాటించండి’ అని కటువుగా మాట్లాడింది. చివరకు ఆ కండక్టర్ టోపీ తీసే వరకు ఒప్పుకోలేదు. ఈ ఘటనను బస్సులోని తోటి ప్రయాణికుడు ఒకరు వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై బీఎంటీసీ అధికారులు స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో మంగళవారం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ ఘటన 10 రోజుల కిందట చోటుచేసుకుందని తెలిపారు. దశాబ్దాల కిందటే యూనిఫామ్ నిబంధనలను రూపొందించామని, ఈ దశలో దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని తెలిపారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో మంగళవారం తమ దృష్టికి వచ్చింది.. ఈ ఘటన 10 రోజుల కిందట చోటుచేసుకుంది,. దశాబ్దాల కిందటే యూనిఫామ్ నిబంధనలను రూపొందించాం.. ఈ దశలో దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేం’ అని అధికారులు వ్యాఖ్యానించారు.