కేరళలో ఓ మంత్రి కాన్వాయ్‌లోని పైలట్ వాహనం.. అంబులెన్స్‌ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ బోల్తాపడి.. అందులోని ముగ్గురు గాయపడ్డారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం నాడు కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి కొట్టాయం నుంచి తిరువనంతపురానికి వెళ్తుండగా.. ఆయన కాన్వాయ్ కొట్టారకరలోని పులమన్ జంక్షన్ ప్రమాదానికి గురైంది. జంక్షన్ దాటుతుండగా.. మరో మార్గంలో అంబులెన్స్ వస్తోంది. దీనిని గమనించిన కాన్వాయ్‌లోని పైలట్ వాహనం.. అంబులెన్స్‌ను ఢీకొట్టి ముందుకెళ్లింది.
అనంతరం అటుగా వస్తోన్న ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టింది. కానీ అంతలోనే ఆ బైకర్ వేగం తగ్గించి, బండి నిలిపివేయడంతో వారికి ప్రమాదం తప్పింది. అంతే కాదు అంబులెన్స్ ను ఢీకొట్టిన తర్వాత.. అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వైపు కూడా అది దూసుకొచ్చింది. కానీ అదృష్టవశాత్తు అతడి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంత్రి కాన్వాయ్ వెళ్లేందుకు కొద్దిసేపు ట్రాఫిక్ నిలిపివేయడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వాహనాలు నిలిపివేయడంతో మరో పక్క నుంచి అంబులెన్స్ వచ్చింది.
అయితే, ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి.. వాహనం దిగి వెళ్లిపోయినట్లు సమాచారం. కనీసం వారిని పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కానీ, క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని మరికొందరు చెబుతున్నారు. అంబులెన్స్‌లోని ముగ్గురు క్షతగాత్రులను పోలీసులు, స్థానికులు చికిత్స కోసం కొట్టరకరలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దృశ్యాలన్నీ ఆ జంక్షన్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.