వ్యాపారస్తులు సీజన్‌ను బట్టి తమ బిజినెస్ ట్రిక్స్‌ను ఫాలో అవుతారు. ఏ సీజన్‌కు తగ్గట్టు ఆ నిర్ణయాలు తీసుకుని వ్యాపారం బాగా జరిగేలా చూసుకుంటారు. వ్యాపారంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ను పాటిస్తేనే.. పోటీ ప్రపంచంలో సత్తా చాటగలరు. అయితే అందరికన్నా విభిన్నమైన నిర్ణయాలు, తీసుకుంటేనే కస్టమర్లను ఆకర్షించవచ్చు. కొంతమంది తమ వ్యాపారం బాగుండాలని.. ఆఫర్లు, రాయితీలు ఇస్తుంటారు. మరికొంతమంది తమ వస్తువులు కొన్నవారికి గిఫ్ట్‌లు అందిస్తారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ మాత్రం అందరికన్నా వినూత్నంగా ఆలోచించాడు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాటాలకు ఉన్న గిరాకీని గ్రహించి.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు. తమ వద్ద టికెట్ బుక్ చేసుకున్నవారికి టమాటాలు ఉచితంగా ఇస్తానని వెల్లడించాడు.
తమిళనాడులోని మధురైలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ.. కస్టమర్లకు బంపరాఫర్ ఇస్తోంది. తమ వద్ద విమాన టికెట్లు కొనుగోలు చేసిన వారికి టికెట్లతోపాటు ఉచితంగా టమాటాలను కూడా ఇస్తోంది. అయితే ఇందులో రెండు రకాల కేటగిరీలుగా విభజించి.. టమాటాలను అందిస్తోంది. దేశంలో ప్రయాణించేవారికి ఒక రకంగా.. విదేశాలకు ప్రయాణించే వారికి మరో రకంగా టమాటాలను పంపిణీ చేస్తోంది. ఆ ట్రావెల్ ఏజెన్సీలో డొమెస్టిక్ విమాన టికెట్ బుక్ చేసుకున్నవారికి ఒక్కొక్క టికెట్ మీద కిలో టమాటాలను ఉచితంగా ఇస్తోంది. అదే విదేశాలకు వెళ్లేవారు బుక్ చేసుకునే ఇంటర్‌నేషనల్ విమాన టికెట్లు బుక్ చేసుకునే వారికి ఒక్కొక్క టికెట్ మీద కిలోన్నర టమాటాలను ఫ్రీగా అందిస్తోంది.
అయితే విమాన టికెట్ల బుకింగ్‌కు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని సదరు ట్రావెల్ ఏజెన్సీ యజమాని వెల్లడించాడు. కేవలం ఎక్కువమంది కస్టమర్లను తన వైపు తిప్పుకునేందుకు ఈ రకమైన ఉచిత టమాటాల పథకం చేపట్టినట్లు తెలిపాడు. టమాటాలు ఉచితంగా ఇస్తుండటంతో గతంతో పోలిస్తే ఎక్కువ మంది కస్టమర్లు వస్తున్నారని.. బిజినెస్ బాగా అవుతోందని చెప్పాడు. దేశం మొత్తం టమాటాల కోసం ఎగబడుతుంటే ఈ వ్యాపారి మాత్రం.. తన బిజినెస్‌ను పెంచుకునేందుకు ఆ టమాటాలను ఇచ్చి కస్టమర్లను తనవైపు లాక్కుంటున్నాడు.
మరోవైపు.. ఇటీవల కురుస్తున్న వర్షాలు.. అంతకుముందు భారీగా ఉన్న ఎండలతో టమాటా పంట ఆశించినంతగా రాలేదు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టమాటాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే టమాటా ధర ఆకాశాన్నంటింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కిలో టమాటా రూ. 150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రూ.250 కి కూడా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టమాటా పండిన రాష్ట్రాల నుంచి పంటను సేకరించి.. మిగిలిన రాష్ట్రాల్లో తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది.