ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఖలిస్థానీ మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. భారతీయ కార్యాలయాలు, భారతీయ పౌరులే లక్ష్యంగా దాడులు, హింసకు దిగుతున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్ సహా వివిధ దేశాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా ఘటనలతో భారత ప్రభుత్వం అప్రమత్తమై ఎప్పటికప్పుడు ఆ దేశ రాయబారులు.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థిపై ఖలిస్థానీ మద్దతుదారులు కర్కశత్వం చూపించారు. తీవ్రంగా కొట్టారు.
సిడ్నీ నగరంలో మంగళవారం తనపై ఖలిస్థానీ వేర్పాటు వాదులు దాడికి పాల్పడ్డారని.. భారత్‌కు చెందిన ఓ విద్యార్థి.. వెల్లడించాడు. వెస్టర్న్ సిడ్నీలోని వెస్ట్‌మేడ్ ప్రాంతంలో దాదాపు 7, 8 మంది ఖలిస్థానీ మూక తనపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిందని పేర్కొన్నాడు. తనను కొడుతున్న సమయంలో ఆ మూక ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిందని చెప్పాడు. ఇనుప రాడ్లతో తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని.. బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను చదువుకుంటూ పార్ట్‌టైమ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు ఆ బాధితుడు వెల్లడించాడు. మంగళవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు తాను బయటికి వచ్చినట్లు తెలిపాడు. తాను ఉంటున్న ఇంటికి.. తాను పార్క్ చేసిన వాహనానికి కేవలం 50 మీటర్ల దూరం మాత్రమే ఉంటుందని పేర్కొన్నాడు. తాను వెళ్లి కారు డ్రైవింగ్ సీటులో కూర్చోగానే 7 , 8 మంది వ్యక్తులు వచ్చి దాడికి దిగారని చెప్పాడు. ఇనుప రాడ్లతో తన మొహంపై కొట్టారని వివరించాడు. అనంతరం తనను కారులో నుంచి కిందికి లాగి పడేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు వెల్లడించాడు. తన ఎడమ కంటి కింది భాగంలో ఇనుప రాడ్‌తో కొట్టడంతో తీవ్ర గాయమైనట్లు చెప్పాడు. నలుగురైదుగురు తనను కొడుతుంటే మరో ఇద్దరు, ముగ్గురు అన్ని వైపుల నుంచి తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసినట్లు తెలిపాడు. తనను కొడుతున్నంత సేపు వారు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ మళ్లీ మళ్లీ నినాదాలు చేశారని పేర్కొన్నాడు.
ఈ ఘటనను అక్కడ ఉన్న స్థానికులు చూశారు. వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 నిమిషాల్లోపే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే తీవ్ర గాయాలతో పడి ఉన్న బాధితుడిని వెస్ట్‌మెడ్ హాస్పిటల్‌కు తరలించారు. అతనికి తల, కాలు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. బాధితుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు వివరించారు.