ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైటానిక్ శిథిలాల సందర్శనకు వెళ్లి,,,,అధిక పీఢనం కారణంగా పేలిపోయిన టైటాన్ మినీ సబ్

international |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 10:08 PM

అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో వెళ్లిన టైటాన్ మినీ-సబ్‌మెరైన్ పేలిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ టైటాన్ సబ్‌‌కు చెందిన యానిమేటెడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. 13 రోజుల్లోనే ఏకంగా 10 మిలియన్ వ్యూస్‌ సాధించింది. టైటాన్ సబ్ విషాదంలో పాకిస్థాన్‌ బిలియనీర్‌ షెహజాదా దావూద్‌ (48), ఆయన కుమారుడు సులేమాన్‌ (19), బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌ (58), ఫ్రెంచ్‌ నేవీ మాజీ అధికారి పాల్‌ హెన్రీ (77), ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌‌ (61)లు ప్రాణాలు కోల్పోయారు. బయలుదేరిన కొద్ది గంటల్లోనే సబ్-మెరైన్‌తో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయి.. టైటానిక్ నౌక సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించారు.


కాగా, ఈ ఘటనకు సంబంధించి యానిమేటెడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. మొత్తం 6 నిమిషాల 20 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియో జూన్ 30న ‘అయిటెల్లీ’ అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేయగా... క్షణాల్లో ట్రెండింగ్ అయింది. పదమూడు రోజుల్లో ఇది 10 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ వీడియోలో టైటాన్-సబ్ ఎలా పేలిపోయింది.. చుట్టుపక్కల సముద్ర పీడనం దానిపై ఎలాంటి ప్రభావం చూపించింది.. పేలిపోయిన తర్వాత దాని శకలాలు ఎలా ఎగిరిపడ్డాయి? వంటివి వీడియోలో కళ్లకు కట్టినట్టు చూపించారు.


ప్రతి చదరపు అంగుళానికి దాదాపు 5600 పౌండ్ల ఒత్తిడితో ఉపరితలంపై మనం అనుభవించే దానికంటే దాదాపు 400 రెట్లు ఎక్కువ పీడనాన్ని అది ఎలా ఎదుర్కొందీ అన్న విషయాలను వివరిస్తూ చూపించడంతోనే ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. దీనికి తోడు అన్నీ వివరంగా చూపించడం కూడా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.


కాగా, కార్బన్ ఫైబర్, టైటానియంతో తయారుచేసిన మినీ-జలాంతర్గామి పొడవు 6.7 మీటర్లు. ఒక పైలట్‌ సహా ఐదుగురు కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామి గరిష్టంగా 4,000 మీటర్ల (13,120 అడుగులు) లోతు వరకు ప్రయాణించేలా రూపొందించారు. టైటాన్ సబ్ కోసం అమెరికా, కెనడా కోస్ట్‌గార్డ్ దళాలు మూడు రోజుల పాటు గాలించాయి. చివరకు అది సముద్రంలో అధిక పీఢనం కారణంగా పేలిపోయినట్టు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com