ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొండెంకు బాలుడి తలను విజవంతంగా అతికించిన వైద్యులు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 10:06 PM

వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతం. ఈ డైలాగ్‌ను మనం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. మెడికల్ రంగంలో రోజురోజుకూ వస్తున్న విప్లవాత్మక మార్పులు, అభివృద్ధితో ఎన్నో రకాల రోగాలకు చికిత్స చేసి.. పూర్తిగా నయం చేస్తున్నారు. కొత్త కొత్తగా వచ్చిన వ్యాధులకు కూడా చికిత్స, వైద్యం అందిస్తున్నారు. ఇలా చాలా దేశాల్లో ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి.. ప్రాణాలు కాపాడిన సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అవయవాల మార్పిడి, చావుబతుకుల మధ్య ఉన్న వారిని కాపాడటం.. ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ వైద్యులు ఒక అద్భుతాన్ని చేశారు. ప్రమాదంలో మొండెం నుంచి వేరు అయిన బాలుడి తలను శస్త్రచికిత్స చేసి విజయవంతంగా మళ్లీ అతికించారు.


సులేమాన్ హాసన్ అనే 12 ఏళ్ల బాలుడు.. ఒకరోజు సైకిల్ తొక్కుతుండగా ప్రమాదం జరిగింది. కారు వచ్చి ఢీకొనడంతో తల భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ బాలుడి వెన్నుపూస భాగం నుంచి పుర్రె భాగానికి ఉండే జాయింట్ మొత్తం తెగిపోయింది. అతని తల.. మెడ భాగం నుంచి దాదాపుగా తెగిపోయింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అత్యవసరంగా ఎయిర్‌లిఫ్ట్ చేసి.. హదస్సా మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. సులేమాన్ హాసన్ పరిస్థితి చూసిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. సులేమాన్ హాసన్‌ పరిస్థితిని వివరించిన డాక్టర్లు.. దాన్ని మెడికల్ భాషలో బైలేటరల్ అట్లాంటో ఓక్సిపిటల్ జాయింట్ డిస్‌లొకేషన్ అంటారని తెలిపారు.


సులేమాన్ హాసన్ పూర్తి చికిత్సను ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఓహద్ ఈనావ్ పర్యవేక్షించారు. మెడ భాగంలో కొత్త కణాలు, నరాలను తిరిగి అతికించడానికి కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు. చిన్నపిల్లలకు చికిత్స చేయడంలో తమకు ఉన్న సామర్థ్యం, అనుభవం.. హాస్పిటల్‌లో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ.. ఈ ఆపరేషన్‌లో ఎంతో ఉపయోగపడ్డాయని వైద్యులు తెలిపారు. సులేమాన్ హాసన్ ప్రాణాలు కాపాడేందుకు తమ డాక్టర్ల బృందం తీవ్రంగా కృషి చేసిందని వివరించారు. ఇది అత్యంత సంక్లిష్టమైన, కీలకమైన ఆపరేషన్ అని.. ఇందులో బాలుడు బతికే అవకాశం 50 శాతం మాత్రమే ఉందని వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో సులేమాన్ హాసన్ కోలుకోవడం ఒక అద్భుతం అని వెల్లడించారు.


అయితే ప్రమాదం గతనెలలో జరిగిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయాన్ని వైద్యులు గానీ, ఆస్పత్రి యాజమాన్యం గానీ బయటకు చెప్పలేదని పేర్కొన్నాయి. ఇది అత్యంత అరుదైన ఆపరేషన్ కాబట్టే.. అది విజయవంతం అయ్యే వరకు విషాయాన్ని వెల్లడించలేదని వైద్య బృందం తెలిపింది. సులేమాన్ హాసన్ ఇటీవలె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. ఇంటికి వెళ్లాడని తెలిపారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని.. పూర్తిగా నయం అయ్యే వరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.


సాధారణంగా ఇలాంటి ప్రమాదం జరిగిన వారికి చాలా సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ ఓహద్ ఈనావ్ తెలిపారు. నాడీ సంబంధ సమస్యలు గానీ మెదడుకు సంబంధించిన సమస్యలు గానీ.. తలకు సంబంధించిన సమస్యలు గానీ వస్తాయని పేర్కొన్నారు. అయితే సులేమాన్ హాసన్ మాత్రం అవేమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. ఇంత పెద్ద ఆపరేషన్ పూర్తయిన తర్వాత కూడా ఎవరి సాయం లేకుండా సొంతంగా నడవడం అంత సులభం కాదని చెప్పారు. ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సకు ప్రత్యేక వైద్యులు అవసరమని.. పెద్ద వారితో పోలిస్తే చిన్న పిల్లలకు ఇలాంటి ఆపరేషన్లు చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని తెలిపారు.


ఈ సందర్భంగా తమ కుమారుడికి అరుదైన శస్త్రచికిత్స చేసి బతికించినందుకు సులేమాన్ హాసన్ తండ్రి.. ఆస్పత్రి వర్గాలకు, వైద్య బృందానికి చాలా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి తన కుమారుడిని వదిలి ఆ తండ్రి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. తనకు ఉన్న ఒకే ఒక్క కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com