చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఏపీ నుంచి పార్లమెంట్‌కు వెళ్లాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను చెప్పారు. తనకు తెలుగు తెలియకపోయే.. తన తల్లి మాట్లాడేవారని చెప్పుకొచ్చారు. టీటీడీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో మత మార్పిళ్లు జరగడం లేదని.. చంద్రబాబు, పవన్ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయాలనుకుంటన్నట్లు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్‌కు రావాలనుకుంటున్నానని.. తాను మధురై నుంచి వచ్చినా.. తన అల్లుడు విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కుమారుడని చెప్పారు. తన తనకు తెలుగు రాదని, తన తల్లి మాట్లాడతారని.. తన ముత్తాతలు టీటీడీ ఆలయాలకు కమాండర్ ఇన్ చీఫ్‌గా పని చేశారని.. అలా తనకూ టీటీడీతో సంబంధం ఉందన్నారు.
కొందరు శ్రీవాణి ట్రస్టు పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలు లూటీ చేస్తున్నారనడం సరికాదన్నారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఆయన భార్య క్రైస్తవులని తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు. తమకు వచ్చే ఆదాయ వ్యయాలపై కాగ్‌తో ఆడిటింగ్‌కు టీటీడీ అంగీకరించిందని.. దేశంలో అలా అంగీకరించిన దేవాలయం మరొకటి లేదన్నారు. తిరుపతి ఇప్పుడు ఉన్నంత వ్యవస్థీకృతంగా గతంలో ఎన్నడూ లేదని ప్రశంసించారు.
ఏపీలో ఆలయాలపై దాడులు, మత మార్పిళ్లు లేవని.. ప్రచారం మాత్రమే అన్నారు. తాను బీజేపీ వ్యక్తినని, ఆ పార్టీ ముఖ్య నేతలతో తాను మాట్లాడాను అన్నారు. టీటీడీ, జగన్ తరఫున మాట్లాడవద్దని తనకు ఎవరూ చెప్పలేదని.. కోర్టులో బీజేపీ న్యాయవాదులు తన వెంట ఉన్నారన్నారు. పార్లమెంట్‌లో తన ఆరేళ్ల పదవీ కాలంలో సంతోషంగా లేను అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు సుబ్రహ్మణ్య స్వామి.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు స్వామి. క్రిస్టియన్స్ చేతిలో టీటీడీ ఉందని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ప్రజా క్షేత్రంలో పోరాడే బదులు చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని టిడిపి,జనసేనలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు ఎప్పుడూ హిందువులకు ఏమీ చేయలేదని.. సోనియాగాంధీతో కలిసి బాబు నడిచారన్నారు. సొంత మామకు గౌరవం ఇవ్వని వ్యక్తి హిందువులకు ఎలా గౌరవం ఇస్తారన్నారు.
హిందూ దేవాలయ వ్యవహారాలలో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దన్నారు స్వామి. వైఎస్ జగన్ ఎన్నడూ హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని.. తాను ఓ మీడియా సంస్థపై వేసిన పరువు నష్టం కేసు అడ్వాన్స్ స్టేజ్ లో ఉందన్నారు. తన వాదనలు ఎవరూ ఆపలేరని.. వంద కోట్ల రూపాయలు పరువు నష్టం కేసు వేశానన్నారు. టీటీడీని అప్రతిష్టపాలు జేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు జగన్ ను ఢీ కొట్టడం అంత సులువు కాదన్నారు.