వినతిపత్రం పేరుతో దండయాత్ర చేసేందుకు పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తున్నారని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనపై స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైరయ్యారు. జనసేన నాయకుడు కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేసుకున్న ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయడం కోసం సోమవారం పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పవన్‌పై ఎమ్మెల్యే భూమన సీరియస్ కామెంట్స్ చేశారు. వినతిపత్రం పేరుతో తిరుపతిపై దండయాత్ర చేసేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు లేదని.. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిపై దాడికి దిగుతున్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్ అనునిత్యం నిందలు వేస్తూనే ఉన్నాడని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తనకు ఓటు వేస్తే ఏం చేస్తారో చెప్పకుండా.. నిత్యం పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అనేది తప్ప, మేము అనేది పవన్ నోటి నుంచి రాదని పేర్కొన్నారు.
కాగా, జనసేన నేత సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే తిరుపతి ఎస్పీ రాష్ట్ర డీఐజీకి రిపోర్ట్ కూడా సమర్పించారు. అయితే ఇప్పటి వరకు ఆమెపై చర్యలు తీసుకోకపోవడంతో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. సీఐ అంజూ యాదవ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే సీఐపై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.