శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. పవన్ తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట వచ్చారు. అక్కడి నుంచి తిరుపతికి చేరుకున్నారు.. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్ చేయిచేసుకున్న ఘటనపై దుమారం రేగింది. ఈ ఘటనపై జనసైనికులు మండిపడ్డారు.. పవన్ కూడా పార్టీ నేతకు అండగా తిరుపతి చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ రాకతో జనసైనికులు భారీగా తరలివచ్చారు.
శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ తీరు మొదటి నుంచి వివాదాస్పదం అవుతోంది. గతంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె విషయంలో అంజూ యాదవ్ ప్రవర్తించిన తీరుపై వివాదం రేగింది. ఆ తర్వాత ఓ హోటల్ నిర్వాహకురాలిపై దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెను బలవంతంగా తీసుకెళ్లి జీపులోకి తోసేయడంతో విమర్శలు వచ్చాయి. తాజాగా జనసేన పార్టీ నేత చెంపపై కొట్టడంతో సీఐ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
అలాగే అంజూ యాదవ్‌కు సంబంధించి మరో వీడియో బయటపడింది. ఓ మహిళను లాక్కెళుతున్న దృశ్యం, జనసేన నేతలను చెంపలపై కొడుతున్న వీడియోలు బయటపడగా.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో తనపై కేసు పెట్టిన వారి హోటల్ ముందు నిల్చున్న సీఐ అంజూయాదవ్ ఒకవైపు మొబైల్‌లో వీడియో తీస్తూనే గట్టిగా వెకిలి నవ్వులు నవ్వుతూ.. తొడ కొడుతున్న వీడియో చర్చనీయాంశం అయ్యింది. సీఐ స్థాయి అధికారి బాధితులను బండి కాగితాలు అడుగుతూ బెదిరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.