గోదావరి జిల్లాల్లో ‘పుస్తెలు అమ్మినా సరే.. పులస తినాలి’సామెత బాగా ఫేమస్. తొలకరి వానల తర్వాత గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు వచ్చేస్తాయి. ఈ ఏడాది కూడా మార్కెట్‌లోకి మొదటి పులస వచ్చేసింది.. అలాగే రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ సీజన్‌లో తొలి పులస కాకినాడకు సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు చిక్కింది. సుమారు మూడు కేజీలు మొట్టమొదటి పులస వలకి దొరికింది.
ఈ చేపను మార్కెట్‌లో వేలం పాట వేస్తే మార్కెట్ లో చేపల విక్రయించే తల్లి కూతుర్లు నాటి పార్వతి, ఆకుల సత్యవతి రూ.13వేలకు అత్యధిక ధరకు దక్కించుకున్నారు. ఆ తర్వాత చేపను భీమవరానికి చెందిన ఒక రాజుకి రూ.15 వేలకు పులస చేపను విక్రయించారు. పులస చేప దొరకడమే చాలా అరుదు అని చెబుతుంటారు గోదావరి జిల్లాలవాసులు.. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలనే కోరిక ఉంటుంది. అందుకే మార్కెట్‌లోకి పులస వస్తే చాలు వ్యాపారులు, జనాలు ఎగబడి మరీ కొనుగోలు చేస్తారు. మరి రేంజ్‌లో ఉంటుంది పులస చేప క్రేజ్.. అందుకే ధర ఎంతైనా కొనుగోలు చేసేందుకు వెనుకాడరు.
పులసలు.. గోదావరి నదిలో మాత్రమే ఉంటాయి.. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకతగా చెబుతారు స్థానిక మత్స్యకారులు. సంతానోత్పత్తి కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి వస్తాయట. అలా హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని చెబుతుంటారు.
ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టేందుకు ఇలా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుందని మత్స్యకారులు చెబుతుంటారు. సీజనల్‌గా ఆషాడ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతుందట. ఇలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగాగానే.. ఎదురీదుతూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుందని చెబుతారు మత్స్యకారులు.
పులస శాస్త్రీయ నామం హిల్సాహిల్సా అంటారట. ఈ పులసలు ఒడిశాతో పాటుటా బంగ్లాదేశ్ తీరాల్లో కూడా దొరుకుతాయట.. కానీ గోదావరిలో దొరికే చేపల రుచి వేరుగా ఉంటుందని చెబుతారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ పులస చేపలు ఎక్కువగా భైరవపాలెం, అంతర్వేది, నరసాపురంలో కనిపిస్తాయి అంటున్నారు. మరీ ముఖ్యంగా గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గరే ఈ పులస చేపలు లభ్యం అవుతాయని మత్స్యకారులు అంటున్నారు. అందుకే ఈ పులస చేపల కోసం వేటకు వెళుతుంటారు. మొత్తం మీద ఈ పులస చేపలు మత్స్యకారులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.