దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల సమరం దాదాపు ఏడాది ముందుగానే ప్రారంభమైంది. కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించిన ప్రతిపక్ష పార్టీలు.. కూటమి పేరును ఇండియాగా నామకరణం చేశారు. అటు.. ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమిలోని పార్టీలను దూరం పెట్టిన బీజేపీ.. ప్రతిపక్ష పార్టీలు ఐక్యం అవుతుండటంతో అప్రమత్తమైంది. తిరిగి పాత మిత్రులను కలుపుకునే పడిలో పడింది. ఈ క్రమంలోనే మంగళవారం.. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో భేటీ నిర్వహించింది. ఈ సమావేశానికి పలు కొత్త పార్టీలను కూడా ఆహ్వానించింది. అయితే ఈ ఎన్డీఏ సమావేశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఢిల్లీలో నిర్వహించే ఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలకు చెందిన నేతలు హాజరు అవుతారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం వెల్లడించారు. అయితే ఈ 38 పార్టీలపై మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అందులోని చాలా పార్టీల పేర్లను తాను ఇప్పటివరకు వినలేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయో లేదో కూడా తనకు తెలియదని ఖర్గే వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను బీజేపీ విస్మరించిందని.. క్రమంగా ఒక్కో పార్టీని దూరం పెట్టిందని విమర్శించారు.
ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని.. దాంతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా దేశంలో బలంగా మారుతున్నాయని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని ఖర్గే పేర్కొన్నారు. దీంతో ఆగమేఘాల మీద మళ్లీ ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఆరోపించారు. అందుకే చిన్న చిన్న పార్టీలు, ఊరూ పేరూ లేని పార్టీలతో సమావేశం నిర్వహించి.. తమ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నారని.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని విపక్ష పార్టీలను భయపెడుతోందని ఖర్గే విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. ఒక నియంత లాగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అందుకే దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే ఇండియా కూటమిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్‌ను గద్దె దించి ఇంటికి పంపించేందుకు ఇండియా కూటమి పోరాడుతుందని తెలిపారు. ఇండియా కూటమి తదుపరి సమావేశం ముంబైలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.