గత నెల రోజుల నుంచి పెరుగుతున్న ధరలతో టమాటా బంగారం కంటే విలువైనదిగా మారిపోయింది. తమ పంటను దొంగలబారి నుంచి కాపాడుకోవటం కోసం రైతులు రాత్రీ పగలు కాపలాకాస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాటా ప్రాంతాలను బట్టి రూ.250 వరకు పలుకుతుంది. రాబోయే రోజుల్లో రూ.300లకు చేరినా ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే, గతం కంటే ఎనిమిది రెట్లు ధరల పెరుగుదలతో టమాటా రైతుల లాభపడుతున్నారు. ఇన్నాళ్లు కనీస ధర లేక రోడ్లపై పారబోసిన టమామాలతో రాత్రికి రాత్రి కోటేశ్వరులవుతున్నారు. తాజాగా, మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఒక రైతు టమాటాలను విక్రయించి ఏకంగా రూ. 2.8 కోట్లను సంపాదించి వార్తల్లో నిలిచాడు.
అంతేకాదు, ఈ సంపాదనను రూ. 3.5 కోట్లకు పెంచడమే టార్గెట్‌గా పెట్టుకోవడం గమనార్హం. పుణేకు చెందిన ఈశ్వర్ గయాకర్ అనే రైతు తనకున్న 12 ఎకరాల పొలంలో టమాటాలను సాగు చేశారు. మొత్తం 12 ఎకరాల్లో సుమారు 4 లక్షల కిలోల టమాటా పండించారు. అందులో సుమారు 3.40 లక్షల కిలోలు ఇప్పటికే విక్రయించి.. సుమారు రూ. 2.8 కోట్లను ఆర్జించారు.
తన దగ్గర ఇంకా 60 వేల కిలోల టమాటాలు ఉన్నాయని, వాటిని కూడా విక్రయించి తన ఆదాయాన్ని రూ. 3.5 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మొదట్లో కిలో టమాటా ధర కేవలం రూ. 30 మాత్రమే ఉండేది. అయితే అనూహ్యంగా ధరలు పెరగడం, పంట దిగుబడి ఎక్కువ రావడం ఈశ్వర్‌కి బాగా కలిసొచ్చింది.
ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందడంలో తన భార్య సొనాలీ సహకారం కూడా ఉందని ఈశ్వర్ చెప్పారు. దీని గురించి ఈశ్వర్ మాట్లాడుతూ.. ఇదంతా ఒక్క రోజులో జరగలేదని, తాము గత ఏడేళ్ల నుంచి టమాటా సాగు చేస్తున్నామని తెలిపారు. చాలా సార్లు తాము భారీ నష్టాలను చవిచూశామని, అయినప్పటికీ తాను టమాటా సాగు చేయడం మానలేదని ఈశ్వర్ చెప్పారు.
2021 ఏకంగా రూ. 20 లక్షల నష్టం వచ్చిందని, అయినా కూడా మేము టమాటాను సాగు చేస్తూనే ఉన్నామని ఈశ్వర్ . కేవలం టొమాటోలను మాత్రమే కాకుండా సీజన్ ప్రకారం ఉల్లి, పువ్వులను కూడా సాగు చేస్తామని ఈశ్వర్ తెలిపారు. రెండున్నర నెలల కిందట కిలో టమాటా రూ.2.50 మాత్రమే ఉండేదని అన్నారు. అంతేకాదు, తమ వల్ల రోజూ 60 నుంచి 70 మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. సెలబ్రిటీ అయిపోయిన ఈశ్వర్ ఇంటర్వ్యూల కోసం స్థానిక మీడియాలు క్యూకడుతున్నాయి. ఇక, ఈ ఏడాది జనవరి 1తో పోల్చితే టమాటా ధరలు 700 శాతం మేర పెరిగాయి.