వచ్చే ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని బలమైన బీజేపీని ఓడించడం అంత ఆషామాషీ కాదు. ఎవరికి వారుగా ఒంటరిగా వెళ్లడం కంటే అందరం కలిస్తే బీజేపీని గద్దె దించడం ఖాయమని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ఏర్పాటు ప్రయత్నాలు వడివడిగా సాగుతున్నాయి. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మెట్టు దిగి.. అందర్నీ కలుపుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు బెంగళూరు వేదికగా జరుగుతోన్న ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవిపై ఆసక్తి లేదని ఆయన పునరుద్ఘాటించారు.
‘కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాన మంత్రి పదవిపైనా ఆసక్తి లేదు.. గతంలో చెన్నైలోనూ ఎంకే స్టాలిన్ జన్మదిన వేడుకల్లో ఇదే చెప్పాను.. ఈ సమావేశం ఉద్దేశం.. అధికారం దక్కించుకోవడం కాదు.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడటం.. మనవి 26 పార్టీలు.. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. బీజేపీకి సొంతంగా 303 సీట్లు రాలేదు.. మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకుని, తర్వాత ఆయా పార్టీలను విస్మరించింది’ అని ఖర్గే ఆరోపించారు.
మన మధ్య కొన్ని విభేదాలున్నా.. అవి సిద్ధాంతపరమైనవి కాదు.. అంత పెద్దవీ కాదు.. సామాన్యులు.. మధ్యతరగతి, యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు.. మైనారిటీల హక్కులను తెరవెనుక నిశ్శబ్దంగా హరిస్తున్నారు.. ప్రజా ప్రయోజనాల కోసం చిన్నపాటి విభేదాలను మనం పక్కనపెట్టి పోరాడగలం’ అని వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాస్తున్నారని ఖర్గే దుయ్యబట్టారు.
కర్ణాటకలోని బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం సమావేశమైన విషయం తెలిసిందే. రెండో రోజైన మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. కూటమి పేరును ‘ఇండియా’గా మార్చినట్టు తెలుస్తోంది. చైర్ పర్సన్‌గా సోనియా గాంధీని నియమించే అవకాశం ఉంది.
‘సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, జాతీయ సంక్షేమమే ఎజెండగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు కలిసి పని చేస్తాయి. ద్వేషం, విభజన, ఆర్థిక అసమానత, దోపిడి వంటి నిరంకుశ, ప్రజా వ్యతిరేక రాజకీయాల నుంచి భారత ప్రజలను విముక్తి చేయాలని మేము కోరుకుంటున్నాం... మాకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలించే భారతదేశం కావాలి. బలహీనమైన వ్యక్తికి ఆశ, విశ్వాసాన్ని అందించే దేశం మాకు కావాలి. దేశం కోసం ఐక్యంగా నిలబడతాం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్‌లో పేర్కొన్నారు.