బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో విపక్షాల కూటమికి I-N-D-I-A అనే పేరును ఖరారు చేశారు. ప్రతిపక్ష ఫ్రంట్‌కు ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I-N-D-I-A)’గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా ప్రకటించారు. దేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మేమంతా చేతులు కలిపామని స్పష్టం చేశారు. సమావేశం ముగిసిన అనంతరం 26 పార్టీలకు చెందిన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్డీఏ, ఇండియా మధ్య యుద్ధం జరగబోతుందని అన్నారు.
ఎన్డీయే, ఇండియాను సవాలు చేయగలదా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ యూపీఏ, ఎన్‌డీఏ గురించి విన్నారు.. కానీ, ఎన్‌డీఏ.. ఇండియాను సవాల్ చేయగలదా? బీజేపీ.. మీరు భారత్‌ను సవాలు చేయగలరా? మేము మా మాతృభూమిని ప్రేమిస్తున్నాం.. మేము దేశభక్తులం’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దీదీ విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని పాలనా యంత్రాంగం చేసే పని ప్రభుత్వాలను కొనడం, అమ్మడం మాత్రమేనని మమత ధ్వజమెత్తారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ వేధిస్తోందని మమతా బెనర్జీ అన్నారు. రాజ్యాంగ సంస్థల సాయంతో రాష్ట్రాల్లోని విపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి చూస్తోందని ఆరోపించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెకట్టుకున్న విపక్షాలు రెండో విడతగా బెంగళూరులో భేటీ అయ్యాయి. సోమవారం సాయంత్రం ఈ భేటీ ప్రారంభమవ్వగా.. మంగళవారం కీలక అంశాలపై నేతలు చర్చించారు. ఇందులో ఒకటైన ‘కూటమి పేరు’పై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఐదారు పేర్లను నేతలు పరిశీలించారు. కూటమి పేరులో ఫ్రంట్ అనే పదం ఉండకూడదని కొన్ని పార్టీలు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో I-N-D-I-A (Indian National Developmental Inclusive Alliance) అనే పేరును ప్రతిపాదించగా.. అత్యధిక పార్టీలు దీంతో ఏకీభవించాయి. ఈ పేరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపాదించినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు.