జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వివిధ రకాల ఆపరేషన్లు చేపట్టి.. ఉగ్రవాదులను బయటికి లాగి సైన్యం మట్టుబెడుతోంది. ఇందుకోసం తాజాగా ఆపరేషన్ త్రినేత్ర 2 అనే మిషన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ త్రినేత్ర 2 సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటివరకు జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ త్రినేత్ర 2 లో ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్, రాష్టీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీస్ బలగాలు పాల్గొన్నాయి. సోమవారం అర్ధరాత్రి ఫూంచ్ జిల్లాలోని సింధార ప్రాంతంలో డ్రోన్లు ఎగిరేసి.. గాలింపు చేపట్టాయి. దీంతో ఉగ్రమూకల కదలికలను గుర్తించిన డ్రోన్లు.. సైన్యానికి సమాచారం అందించడంతో.. ఆర్మీ రంగంలోకి దిగి ఎన్‌కౌంటర్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ మంగళవారం ఉదయం వరకు కొనసాగింది.
పూంఛ్ జిల్లాలోని సురాన్ కోట్ సమీపంలో ఉన్న సింధార, మైదాన గ్రామాల్లో దాక్కొని ఉన్న నలుగురు ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. వారి నుంచి ఆయుధాలు భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు వివరించారు. ఆ ఉగ్రవాదులు రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో భారీ ఉగ్రదాడులు చేసేందుకు పన్నాగం పన్నినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆర్మీ చేతిలో హతమైన నలుగురు ఉగ్రవాదుల్లో వేరే దేశాలకు చెందినవారు ఉన్నట్లు గుర్తించారు. చనిపోయిన ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రాంతంలో భారీగా గ్రనేడ్లు దొరిగినట్లు పేర్కొన్నారు. దీంతో కాలాఝూలా ఫారెస్ట్ ఏరియాలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మరోవైపు.. పూంఛ్ జిల్లాలో గస్తీ ముమ్మరం చేశారు. రోడ్లపై వెళ్తున్న ప్రతి వాహనంలో తనిఖీలు నిర్వహస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పూంఛ్‌లో వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగిన ఘటనలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. భింబర్ గలీ నుంచి సాంగియోట్‌కు ఇఫ్తార్ విందు కోసం పండ్లు తీసుకెళ్తున్న సైనిక వాహనంపై ముష్కరులు బాంబులు, తుపాకులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో స్టీల్ బుల్లెట్లను వినియోగించినట్లు ఆర్మీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన తర్వాత కూడా ఫూంచ్ ప్రాంతంలో అప్పుడప్పుడు ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. ఇందులో జైష్ ఏ మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలు స్థానికంగా ఉండే ఉగ్రవాదులతో కలిసి దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ దాడితో మరింత అప్రమత్తమైన సైన్యం.. ముష్కరుల ఏరివేత ప్రక్రియను ముమ్మరం చేసింది.